IPL 2022 MI VS DC: ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా బ్రబౌర్న్ వేదికగా ముంబయి ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముంబయి జట్టు నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ జట్టు 18.2 ఓవర్లలోనే ఛేదించింది.
178 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన దిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లుగా దిగిన పృధ్వీషా, టిమ్ సీఫెర్ట్ భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో టిమ్ సిఫెర్ట్(21) ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మన్‌దీప్‌ను(0) అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్‌ను(1) కూడా మిల్స్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన పృధ్వీషా(38), పావెల్(0) వికెట్లను బాసిల్ థంపి ఒకే ఓవర్లో తీశాడు. ఫలితంగా 77 పరుగుల వద్ద దిల్లీ సగం వికెట్లు కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ నిలకడగా ఆడారు. థంపి బంతికి శార్దూల్ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఇక ఆఖర్లో లలిత్ యాదవ్(48), అక్షర్ పటేల్(38) మెరుపులు మెరిపించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముంబయి బౌలర్లలో బాసిల్ థంపి మూడు వికెట్లు తీయగా, మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. మిల్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
అంతకముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం చేశారు. ఇషాన్ కిషన్(81)అద్భుతంగా రాణించాడు. అయితే నిలకడగా ఆడుతున్న సారథి రోహిత్ శర్మను (41) దిల్లీ బౌలర్ కుల్దీప్యాదవ్ ఔట్ చేశాడు. దీంతో హిట్‌మ్యాన్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్(8), తిలక్ వర్మ(22), పోలార్డ్(3), టిమ్ డేవిడ్(12) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఇషాన్ కిషన్(81), డానియల్ సామ్స్(7) నాటౌట్‌గా నిలిచారు. దిల్లీ బౌలర్లలలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇదీ జరగండి: స్విస్ ఓపెన్ టైటిల్ విజేతగా పీవీ సింధు.. ప్రణయ్‌కు నిరాశ