IPL 2022: టీ20 ఫార్మాట్లో.. అదీ ఐపీఎల్లో ఎన్ని పరుగులు చేసినా.. గెలుస్తామన్న నమ్మకం ఉండదు! 200 పైగా పరుగులు చేసినా ఓ జట్టు మ్యాచ్ ఓడిన సందర్భాలు అనేకం. అయితే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరు చేసినా.. మ్యాచ్ కాపాడుకోవడం అనేది మాములు విషయం కాదు. అలాంటి సమయాల్లో తీవ్రమైన పోటీతత్వాన్ని, తెగువను ప్రదర్శించాల్సి ఉంటుంది. అత్యల్ప స్కోరు చేసైనా.. విజయం సాధించి.. ప్రేక్షకులను అసలైన ఐపీఎల్ మజా అందించిన ఓ ఐదు మ్యాచ్‌లను ఓ సారి గుర్తుచేసుకుందాం.
ముంబయి ఇండియన్స్ - పుణె వారియర్స్ ఇండియా, 2012
ఐపీఎల్ చరిత్రలో స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో ఇది ఒకటి. 2012లో ముంబయి ఇండియన్స్, పుణె వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. సచిన్ తెందూల్కర్ 35 బంతుల్లో 34 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా చెరో రెండు వికెట్లు తీశారు.
121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణె జట్టు మొదటి నుంచీ వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివరి 10 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దశలో.. 105 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. మిథున్ మన్హస్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టును గెలిపించడానికి విఫలయత్నం చేశాడు. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో ముంబయి విజయం సాధించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ - పుణె వారియర్స్ ఇండియా, 2013
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణె.. 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. ఆశిష్ రెడ్డి, సమంత్ రాయ్ రాణించడం వల్ల 119/8 పరుగులు చేసింది. ఛేదనను ప్రారంభించిన పుణె 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో 11 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. అమిత్ మిశ్రా 4 వికెట్లు, భువనేశ్వర్ 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
పంజాబ్ కింగ్స్ - ముంబయి ఇండియన్స్, 2009
2009లో ముంబయి ఇండియన్స్‌తో ఉత్కంఠగా జరిగిన ఈ స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో పంజాబ్ గెలిచింది. కుమార సంగక్కర 44 బంతుల్లో 45 పరుగులు చేయడం వల్ల పంజాబ్ 20 ఓవర్లలో 119/8 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ముంబయి.. 116/7 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్.. 3 పరుగుల స్పల్ప తేడాతో గెలిచింది. జేపీ డుమిని 63 బంతుల్లో 59 పరుగుల చేసినా ప్రయోజనం లేకపోయింది.
ముంబయి ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్, 2018
ఐపీఎల్ చరిత్రలోనే షాకింగ్ ఫలితాలు వచ్చిన మ్యాచ్‌లో ఇది ఒకటి. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్.. 87 పరుగులకే ఆలౌటైంది. రషిద్ ఖాన్, బాసిల్ తంపీ, సిద్ధార్థ్ కౌల్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్ల ఎస్ఆర్హెచ్ 21 పరుగుల తేడాతో గెలిచింది. ఒక దశలో 61/3 తో మెరుగైన స్థితిలో ఉన్న ముంబయి.. ఆ తర్వాత చేతులెత్తేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్, 2009
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ చరిత్రలోనే స్వల్ప స్కోరును కట్టడి చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 2009లో పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నై 20 ఓవర్లలో 116 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ మొదటి నుంచి ఒత్తిడిలోనే ఆడింది. 20 ఓవర్లకు 92 రన్స్ చేసి.. 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఎన్నో ఉత్కంఠగా జరిగే మ్యాచ్‌లకు వేదికైన ఐపీఎల్లో.. కొత్త సిీజన్ మార్చి 26న ప్రారంభంకానుంది. మరి ఈ సీజన్లో ఏ జట్టు తమ అత్యల్ప స్కోరును కూడా కాపాడుకొని విజయం సాధిస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: ఐపీఎల్‌కు పాకిస్థాన్ సవాల్.. ఎలా ఆడతారో చూస్తామంటూ..!