IPL 2022 Kolkata Rinkusingh: చాలా మంది క్రీడాకారుల్లాగే తానూ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి వచ్చానని కోల్‌కతా యువ బ్యాటర్ రింకూసింగ్ అన్నాడు. గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన కీలక మ్యాచ్‌లో 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రింకూ (40; 15 బంతుల్లో 2x4, 4x6) అద్వితీయ పోరాటం చేసిన సంగతి తెలిసిందే. చివర్లో ఆశలు లేని స్థితిలో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతాను గెలిపించినంత పని చేశాడు. అయితే, చివరి క్షణాల్లో ఊహించని విధంగా ఎవిన్ లూయిస్ పట్టిన అద్భుత క్యాచ్‌కు ఔటై త్రుటిలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. అయినా, అతడి ఆటకు కోల్‌కతా అభిమానులే కాకుండా మొత్తం క్రికెట్ ప్రియులు మంత్రముగ్ధులయ్యారు. దీంతో రింకూ ఒక్క మ్యాచ్‌తో ఫేమస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోల్‌కతా విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడిన అతడు.. గడిచిన ఐదేళ్లలో అనేక కష్టాలను చవిచూశానన్నాడు.
"గత ఐదేళ్లు నాకు చాలా కష్టంగా గడిచాయి. 2018లో తొలిసారి కోల్‌కతాకు ఎంపికైనప్పుడు అవకాశాలు వచ్చినా సరిగ్గా ఆడలేకపోయా. అయినా, నా మీద నమ్మకం ఉంచి జట్టు యాజమాన్యం మిగిలిన సీజన్లలోనూ అట్టిపెట్టుకొంది. అదే సమయంలో నా శారీరక పరిస్థితుల దుష్ట్యా చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే, నేనెప్పుడూ వెనుబడ్డట్టు జట్టు భావించలేదు. ముఖ్యంగా గతేడాది చాలా కష్టంగా మారింది. అప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో మోకాలికి గాయమైంది. దీంతో నాకు శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి 6-7 నెలల సమయం పడుతుందని చెప్పేసరికి తట్టుకోలేకపోయా. అప్పుడు నేను ఈ టోర్నీ గురించే ఆలోచించా. దీంతో చాలా రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దాన్ని భరించలేకపోయా. అప్పుడు మా నాన్న రెండు, మూడు రోజుల పాటు భోజనం కూడా చేయలేదు. దాంతో క్రికెట్‌లో ఇలాంటి గాయాలన్నీ సహజమే అని నచ్చజెప్పా. ఎందుకంటే మా కుటుంబానికి నేనే ప్రధాన జీవనాధారం. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కష్టాలు తప్పవు. ఆ సమయంలో కాస్త బాధపడ్డా.. ఆత్మస్థైర్యంతో త్వరగా కోలుకుంటాననే అనుకున్నా" అని రింకూ చెప్పుకొచ్చాడు.
కాగా, రింకూ తొలిసారి 2018లో కోల్‌కతా తరఫున ఆడినా విఫలమయ్యాడు. మరుసటి సీజన్‌లోనూ తేలిపోయాడు. అదే నేపథ్యంలో 2020లోనూ ఒకే మ్యాచ్ ఆడి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇక గతేడాది మోకాలి గాయం కారణంగా మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. కానీ, ఈ ఏడాది అవకాశాలు బాగా రావడంతో వాటిని సద్వినియోగం చేసుకొన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 34.80 సగటుతో 174 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 148.72గా ఉంది. ఈ గణాంకాలను ఆధారంగా రింకూ ఇప్పుడెలా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక గతరాత్రి లఖ్‌నవూకు ముచ్చెమటలు పట్టించాడు.
ఇదీ చూడండి: ఐపీఎల్ హక్కులకు రూ.33వేల కోట్లు.. మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పులు!