IPL 2022: ఎప్పుడో గౌతమ్ గంభీర్ (2012, 2014) కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. గతేడాది ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కేకేఆర్ ఫైనల్‌కు చేరినా మూడోసారి అదృష్టం వరించలేదు. అయితే, అప్పుడు కీలకంగా ఉన్న శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, లాకీ ఫెర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లు ఇప్పుడు లేరు. వ్యక్తిగతంగా రాణించకపోయినా జట్టును నడిపించడంలో విజయవంతమైన మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తిక్‌ను ఈసారి తీసుకోలేదు. అయితే, గతేడాది ఫామ్‌లో లేని ఆండ్రూ రస్సెల్‌ను మరోసారి రిటెయిన్ చేసుకున్న కేకేఆర్.. సునిల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిని కూడా అట్టిపెట్టుకుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కాస్త బలహీనంగానే కనిపిస్తోంది.
ఇంకా కీలకమైన ఆటగాళ్లెవరంటే?
శ్రేయస్ అయ్యర్‌ను రూ. 12.50 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసుకొని సారథ్య బాధ్యతలను అప్పగించింది. 2020 ఐపీఎల్ సీజన్‌లో దిల్లీని ఫైనల్‌కు చేర్చిన చరిత్ర ఉంది. గత కొన్ని రోజులుగా ఫామ్‌ను చూసుకుంటే శ్రేయస్ పీక్స్‌లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు బాదాడు. అందుకేనేమో కేకేఆర్ యాజమాన్యం శ్రేయస్‌ను ఎంచుకుంది. శ్రేయస్ అయ్యర్ కాకుండా జట్టులో వెంకటేశ్ అయ్యర్, రస్సెల్, చమిక కరుణరత్నె, సునిల్ నరైన్, నితీశ్ రాణా, ప్యాట్ కమిన్స్, మహమ్మద్ నబీ, అంజిక్య రహానె బాగా సుపరిచితులు.
బ్యాటింగ్‌లో ఆదుకునేది..!
ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలిగే సత్తా సునిల్ నరైన్ సొంతం. ఇక ఓపెనర్లుగా వెంకటేశ్ అయ్యర్‌తో సందర్భాన్ని బట్టి నరైన్ దిగుతాడు. అయితే వీరిద్దరూ లెఫ్ట్ హ్యాండర్లు. ఈ నేపథ్యంలో వెంకటేశ్‌కు తోడుగా ఎవరిని పంపుతుందో వేచి చూడాలి. వన్‌డౌన్‌లో అయితే శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, అలెక్స్ హేల్స్, ఆండ్రూ రస్సెల్, అజింక్యా రహానె (తుది జట్టులో ఉంటే), షెల్డన్ జాక్సన్, నబీ, కరుణరత్నె, అనుకుల్ రాయ్ తదితరులు బ్యాటింగ్ చేస్తారు. అయితే, వీరిలో వెంకటేశ్, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్, సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ మినహా ఎవరిపైనా పెద్దగా అంచనాలు లేవు.
బౌలింగ్ విభాగం అదుర్స్..
కోల్‌కతా జట్టులో బౌలర్లకు కొదవ లేదు. ప్యాట్ కమిన్స్, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, మహమ్మద్ నబీ.. 25 మందిలో మూడొంతుల మంది బౌలింగ్ చేస్తారు. అయితే, తుది జట్టులో కమిన్స్/సౌథీ, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి ఉండటం ఖాయం. ఆల్‌రౌండర్ల జాబితాలో సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ ఎలానూ జట్టులో ఉంటారు. బౌలింగ్‌పరంగా ఇబ్బందులు లేనప్పటికీ బ్యాటింగ్ బలహీనంగా ఉండటంతో అద్భుత బౌలింగ్ కూడా వృథా అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో శ్రేయస్‌తో సహా కోల్‌కతా ఫ్రాంచైజీ బ్యాటింగ్‌పై మరింత దృష్టిసారించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: IPL 2022: ఐపీఎల్లో ఎక్కవసార్లు డకౌట్ అయ్యింది ఎవరో తెలుసా?