IPL 2022 Highest Individual Scores : మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా బ్యాటర్లు వారి పరుగుల దాహం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ లీగ్‌లో కొందరు బ్యాటర్లు ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడి భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈసారి కూడా ప్లేయర్స్ ఇలాంటి ఇన్నింగ్స్నే ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన క్రికెటర్ల గురించి తెలుసుకుందాం..
లీగ్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు వీళ్లవే..
క్రిస్ గేల్(175)
Chris Gayle: ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2013 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడిన గేల్.. పుణెతో జరిగిన ఓ మ్యాచ్‌లో 175 పరుగులు సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే ఇతడు సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 130 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
బ్రెండన్ మెక్‌కలమ్(158)
Brendon McCullum: ఐపీఎల్ ప్రారంభ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే విజృంభించాడు న్యూజిలాండ్ బ్యాటర్ మెక్‌కలమ్. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన ఇతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో 158 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మెక్‌కలమ్ మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడం వల్ల కోల్‌కతా 140 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఏబీ డివిలియర్స్(133)
AB Devilliers: 2015లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ ఏబీ డివిలియర్స్ 59 బంతుల్లో 133 పరుగులు చేసి అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో (82) కలిసి 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు మిస్టర్ 360. ఇందులో 19 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఏబీడీ ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కేఎల్ రాహుల్(132)
K L Rahul: 2020 సీజన్ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ .. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లో 132 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు లీగ్ చరిత్రలో ఓ భారత్ ఆటగాడి వ్యక్తిగత అత్యధిక స్కోరు ఇదే. ఇందులో 14 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో విజయం సాధించింది పంజాబ్.
ఏబీ డివిలియర్స్(129)
AB Devilliers: ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలోనూ దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్సే కొనసాగుతున్నాడు. 2016 సీజన్లో భాగంగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీడీ 52 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 12 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 109 పరుగులు చేశాడు. గుజరాత్ జట్టును 104 పరుగులకే ఆలౌట్ చేసిన కోహ్లీ సేన 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఇదీ చదవండి: IPL 2022: పేపర్ మీద 'సూపర్‌హిట్' టీమ్.. మరి ఫీల్డ్‌లో?