IPL 2022 CSK: గతేడాది చెన్నై ఛాంపియన్‌గా గెలిచాక కెప్టెన్సీ పగ్గాలు రవీంద్ర జడేజాకు అప్పగించాలని ధోనీ అప్పుడే నిర్ణయించుకున్నాడని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. గతరాత్రి కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలయ్యాక ఆయన మీడియాతో మాట్లాడాడు. 'కెప్టెన్సీ మార్పు గురించి మేం గతేడాదే మాట్లాడుకున్నాం. అప్పుడు చెన్నై గెలిచాక ధోనీ నాతో తన అభిప్రాయం పంచుకున్నాడు. దీంతో జడేజాకు నాయకత్వం అప్పగించాలనే విషయంపై అన్ని విధాలా చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయాన్ని చెన్నై యజమాని శ్రీనివాసన్‌కు కూడా తెలియజేశాం. కెప్టెన్సీ మార్పు మా జట్టులో సజావుగానే సాగింది' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమిపై స్పందించిన కోచ్.. ఇక్కడి పరిస్థితులు కాస్త కఠినంగా ఉన్నాయని, వాటిని తాము సరిగ్గా అంచనా వేయలేకపోయామని చెప్పాడు. అలాగే ఆటగాళ్లు కాస్త తడబడినట్లు కూడా అభిప్రాయపడ్డాడు. ముంబయి పరిస్థితులను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమని.. అయితే, ఈ మ్యాచ్‌లో తాము కొద్ది బంతుల తేడాతోనే వెనుకపడ్డామని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. గతేడాది కూడా తమకు ఇలాంటి పరిస్థితులే ఎదురైనట్లు గుర్తు చేసుకున్నాడు. అయినా, వాటిని అధిగమించి ముందుకు సాగామన్నాడు. ఇప్పుడు కూడా మున్ముందు రాణిస్తామనే నమ్మకం ఉందన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై తొలుత 131/5 స్కోర్ చేయగా కోల్‌కతా 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఇదీ చదవండి: కోచ్‌కు ధోనీ స్వీట్ వార్నింగ్.. అడిగేవరకు సలహాలు ఇవ్వొదంటూ..