IPL 2022 Chennai Super Kings: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్న చెన్నై అయిదో టైటిల్‌తో ముంబయిని సమం చేయాలనే పట్టుదలతో ఉంది. సారథి మారినా సీఎస్కేకు వచ్చే ప్రమాదమేమీ లేదు. జడేజాకు అండగా ఉంటూ తగిన సలహాలు, సూచనలతో నడిపించేందుకు ధోనీ ఉన్నాడు. అందుకే ఈ సారి కూడా ఆ జట్టు టైటిల్ ఫేవరేట్ అనడంలో సందేహం లేదు. ధోనీ, జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్‌ను అట్టిపెట్టుకున్న చెన్నై.. వేలంలో అంబటి రాయుడు, ఉతప్ప, బ్రావోలను తిరిగి దక్కించుకుంది. దీంతో మళ్లీ దాదాపు పాత జట్టే కొనసాగే అవకాశం ఉంది.
బలాలు: చాలా కాలంగా జట్టుతో సాగుతున్న ఆటగాళ్ల అనుభవం అతిపెద్ద బలం. ధోనీ, జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్, అంబటి రాయుడు, బ్రావో.. ఇలా జట్టు ప్రధాన ఆటగాళ్ల బృందం పటిష్ఠంగా ఉంది. రుతురాజ్, అలీ మంచి ఫామ్‌లో ఉన్నారు. సారథిగా తప్పుకొన్నా ధోనీ ఉనికి జట్టుకు కొండంత అండ. ఆల్‌రౌండర్లు జట్టుకు మరో బలం. జడేజా, అలీ, బ్రావోకు శివమ్ దూబె, ప్రిటోరియస్ జత కలిశారు. ముఖ్యంగా ఈ సారి కెప్టెన్‌గా కొత్త అవతారం ఎత్తనున్న జడేజా.. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. 140 కిలోమీటర్ల వేగంతో బంతులేయగల అండర్-19 స్టార్ ఆల్‌రౌండర్ హంగార్గేకర్ ఆసక్తి కలిగిస్తున్నాడు.
బలహీనతలు: రుతురాజ్‌కు జతగా మరో నాణ్యమైన ఓపెనర్ లేకపోవడం లోటే. గత కొన్ని సీజన్లుగా రుతురాజ్, డుప్లెసిస్ జట్టుకు అదిరే ఆరంభాలనిచ్చారు. ఈ సారి డుప్లెసిస్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. కాన్వేకు అవకాశమిస్తారా లేదా ఉతప్పను ఓపెనర్‌గా పంపిస్తారా అన్నది చూడాలి. పవర్‌ప్లేలో బౌలింగ్‌తో, ఆఖర్లో బ్యాటింగ్‌తో ఆకట్టుకునే పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమవడం జట్టుకు పెద్ద దెబ్బ. జోర్డాన్, ప్రిటోరియస్, మిల్నెపై అంచనాలు అంతంతమాత్రమే. ఆల్‌రౌండర్ బ్రావో జోరు తగ్గింది. జట్టులో ఉన్న ఏకైక లెగ్‌స్పిన్నర్ ప్రశాంత్ సోలంకీకి అనుభవం లేదు.
దేశీయ ఆటగాళ్లు: ధోనీ, నిశాంత్, ఉతప్ప, రుతురాజ్, సుభ్రాన్షు, రాయుడు, జగదీశన్, భగత్, రాజ్‌వర్ధన్, జడేజా, దూబె, దీపక్, ఆసిఫ్, ముకేశ్, ప్రశాంత్, సిమర్జీత్, తుషార్
విదేశీయులు: కాన్వే, జోర్డాన్, ప్రిటోరియస్, బ్రావో, శాంట్నర్, మొయిన్ అలీ, మిల్నె, తీక్షణ
వీళ్లు కీలకం: రుతురాజ్, ధోనీ, జడేజా, మొయిన్ అలీ, బ్రావో, రాయుడు.
ఉత్తమ ప్రదర్శన: 2010, 2011, 2018, 2021లో విజేత
ఇదీ చదవండి: Ipl 2022: జడేజా.. ధోనీ నమ్మకాన్ని నిలబెడతాడా.?