ఆహా.. ఎన్ని రోజులైంది ఈ రేంజ్ ఆట చూసి. ఇలాంటి ఉత్సాహం, ఉత్కంఠకు దూరమైంది కొన్ని నెలలే అయినా.. క్రికెట్ ప్రేమికులకు అది ఎన్నో ఏళ్లుగా అనిపించింది. దాహంతో ఉన్నవాడు.. నీరు దొరికితే చాలనుకున్నప్పుడు.. మినరల్ వాటర్ లభిస్తే ఎలా ఉంటుందో, ఏదోలా క్రికెట్ మొదలైతే చాలు అనుకున్న వారందరికీ.. రసవత్తర పోరు వీక్షించడానికి కేవలం 2 మ్యాచ్‌లు పట్టిందంతే. ఇళ్లల్లోనే ఉన్నా.. ఎగిరారు, దూకారు, కిందపడ్డారు, గాల్లో గట్టిగా పంచెస్ ఇచ్చారు. మరి మామూలు ఎంటర్‌టైన్‌మెంటా దిల్లీ-పంజాబ్ మ్యాచ్ ఇచ్చింది..? ఇలాంటి మ్యాచ్‌లే కదా.. 'ఐపీఎల్ లాంటి లీగ్.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్' అనిపించేలా చేసేది.
అయితే.. ఇంత ఉత్కంఠభరిత మ్యాచ్ సాగడానికి దోహదపడిందేంటి..? కచ్చితంగా లో స్కోరింగ్ మ్యాచ్ అవడమే. సగటు ప్రేక్షకుడికి పొట్టి క్రికెట్ అంటే ఫోర్లు, సిక్సర్లే కనిపిస్తాయి. కానీ సిసలైన ఆట ప్రేమికుడికి మాత్రమే తెలుసు.. తక్కువ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌లో మజా.
తొలి మలుపు
దిల్లీ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. షమీ, కాట్రెల్ అద్భుత స్వింగ్ బౌలింగ్. పరుగులు రావడమే కష్టమైంది. కాట్రెల్ కట్టడి చేయగా... షమీ 2 వికెట్లు తీశాడు. ఓ రనౌట్ కూడా జరిగింది. దాని ఫలితమే 4 ఓవర్లలో 13/3. మ్యాచ్ చప్పగా జరుగుతుందేమో అని చాలా మంది ఓ నిట్టూర్పు వదిలి ఊరుకున్నారు. కానీ అయ్యర్, పంత్ కలిసి బండిని గాడిలో పెట్టి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ సమయంలో మళ్లీ ఓ 'మినీ సైకిల్ స్టాండ్' లైనప్ తలపునకు వచ్చింది. 86/3 నుంచి 16.1 ఓవర్లలో 96/6కి పడిపోయింది.
ఈ సమయంలో క్రీజులో ఉన్న ఆఖరి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ (ఆల్‌రౌండర్).. స్టోయినిస్. తోడుగా ఉన్న అశ్విన్ ఉపయుక్తమైన బ్యాట్స్‌మనే అయినా వేగంగా పరుగులు చేస్తాడన్న నమ్మకం ఎవరూ పెట్టుకోలేదు. మ్యాచ్‌ను తొలిసారిగా ఆసక్తికరంగా మార్చే మలుపు అక్కడే తిరిగింది. అప్పటికి 2(4)పరుగులతో క్రీజులో ఉన్న స్టోయినిస్ జూలు విదిల్చాడు. 18వ ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్, 19వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. ఇక్కడి వరకూ సాధారణంగా చాలా మటుకు మ్యాచ్‌ల్లో జరిగే విధ్వంసమే. ఇక ఆఖరి ఓవర్‌లో స్టోయినిస్‌కు ఏకంగా పూనకమే వచ్చింది. జోర్డాన్‌కు పీడకల పుట్టించేలా దంచేశాడు. 2 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టి ఐదో బంతికి రనౌటయ్యాడు. 252.38 స్ట్రైక్‌రేట్‌తో 53(21) వద్ద తన సుడిగాలి ఇన్నింగ్స్‌ను ముగించాడు.
రెండో మలుపు
మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్, ప్రతిభావంతుడైన మయాంక్.. విధ్వంసకారులు పూరన్, మ్యాక్స్‌వెల్. ఇదీ పంజాబ్ టాపార్డర్ లైనప్. 158 లక్ష్యమే కదా పెద్దగా రిస్క్ తీసుకోకుండా కొట్టేస్తారనుకున్నారంతా. 4.2 ఓవర్ల వరకూ 30/0. సాఫీగానే ఉందనుకున్నారు. చక్కటి ఇన్‌స్వింగర్‌తో పెద్దతల రాహుల్‌ను మోహిత్ ఔట్ చేశాడు. అప్పటికి అగర్వాల్ 2(9) పరుగులతో క్రీజులో ఉన్నాడు. తర్వాతి ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్ తన పాత జట్టుపై కసి తీర్చుకోవాలనుకున్నాడో ఏమో.. ఒకటే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. నేనేమైనా తక్కువ తిన్నానా అనుకున్నాడో ఏమో.. బిగ్ షో మ్యాక్స్‌వెల్‌ను పెవిలియన్ దారి పట్టించాడు.. కగిసో రబాడ. జట్టు స్కోరు 35/4. అగర్వాల్ 5(11). సరిగ్గా ఇన్నింగ్స్ మధ్య నాటికి.. అంటే పది ఓవర్లు ముగిసేసరికే 55 పరుగులకు సగం జట్టు ఔట్. ఇక అక్కడ్నుంచి మొదలైంది మయాంక్ కళాత్మక విధ్వంసం. ముందు పక్కాగా కుదురుకునేందుకు సమయం తీసుకున్న అతడు.. 13వ ఓవర్ చివరి బంతికి తొలిసారిగా వంద స్ట్రైక్‌రేట్ మార్క్‌ను అందుకున్నాడు. అవతలి ఎండ్‌లో గౌతమ్ 20 పరుగులు చేశాక ఔటైనా.. బెదరలేదు. నోర్జే ఓవర్‌లో 2 ఫోర్లు, మోహిత్ శర్మ ఓవర్‌లో 2 సిక్సులు, రబాడ ఓవర్‌లో 2 ఫోర్ల సాయంతో.. 3 ఓవర్లలో 40 పరుగులు సాధించాడు. ఆఖరి ఓవర్‌లో 13 కొట్టాల్సి ఉండగా.. 3 బంతుల్లోనే 12 పరుగులు సాధించి స్కోర్లు సమం చేసేశాడు. హమ్మయ్య రెండు పాయింట్లు వచ్చేసినట్టే అనుకుంది పంజాబ్ డగౌట్ అంతా. అయితే..
ముచ్చటగా మూడో మలుపు
తన మెరుపు ఇన్నింగ్స్‌తో దిల్లీకి పోరాడే అవకాశం కల్పించిన స్టోయినిస్.. బంతితోనూ మాయ చేశాడు. ఒక్క పరుగు కాపాడుకుంటే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లే స్థితిలో 2 ఫుల్‌టాస్‌లతో 2 వికెట్లు పడగొట్టి హీరో అయిపోయాడు. నిజానికి ఈ 2 బంతుల్లో పంజాబ్ బ్యాట్స్‌మన్ మయాంక్, జోర్డాన్ ఒత్తిడి ఫీల్ అయినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే అవి అంత గొప్ప బంతులేమీ కావు. అవలీలగా సింగిల్ తీయాల్సిన బంతులే. బౌండరీతో ఫినిషింగ్ షాట్‌కు వారు యత్నించగా.. క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యారు. తన ప్రశాంతతను నిలుపుకొని ఒక్క పరుగును కాచుకున్న స్టోయినిస్‌ను మెచ్చుకుని తీరాల్సిందే. ఇక ఆ తర్వాత సూపర్‌ఓవర్‌లో రబాడ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ దిల్లీ వశమైంది.
తమ తమ జట్లకు స్టోయినిస్, మయాంక్.. హీరోలుగా నిలిచారనడంలో సందేహం లేదు. ఇద్దరూ క్లిష్టమైన పరిస్థితుల్లోనే వచ్చారు. తన కండబలాన్ని నమ్ముకుని స్టోయినిస్ విధ్వంసం సృష్టిస్తే.. అదే విధ్వంసానికి కళాత్మక రూపునిచ్చాడు మయాంక్. ఇద్దరివీ రెండు వేర్వేరు శైలులు. పోల్చి చూడలేం. ఫినిషర్‌గా వచ్చిన స్టోయినిస్ తన కర్తవ్య బాధ్యతను నిర్వహించాడు. ఓపెనర్‌గా వచ్చి, లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. తన వారిని ఒక్కొక్కరిని కోల్పోతున్నా... తన స్ట్రైక్‌రేట్ కలవరపెడుతున్నా.. గొప్ప పరిణతితో ఆడిన మాయంక్ ఇన్నింగ్స్ ఐపీఎల్‌లో ఉత్తమమైన ఒకటిలో నిలుస్తుంది. ఇలా ఇద్దరూ మంచి ప్రదర్శనే చేసినా జట్టు గెలుపునకు తోడ్పడే ఇన్నింగ్స్‌తో చివరి ఓవర్‌తో మ్యాచ్‌నే మలుపుతిప్పిన స్టోయినిస్‌కు కొన్ని మార్కులు ఎక్కువగా ఎక్కువ వేయొచ్చు.