దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో గెలిచింది. 178 పరుగుల లక్ష్య ఛేదనను మరో రెండు బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది ఆర్సీబీ. డివిలియర్స్(55 నాటౌట్), కోహ్లీ(43) విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ.. ప్లేఆఫ్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది.
ఛేదనలో 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్సీబీ. 14 పరుగులు చేసిన ఫించ్ ఔటయ్యాడు. అనంతరం దేవ్‌దత్-కోహ్లీ జోడీ స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించింది. ఈ క్రమంలోనే రెండో వికెట్‌కు 79 పరుగులు జత చేసింది. అనంతరం దేవదత్(35), కోహ్లీ(43) వరుస బంతుల్లో ఔటయ్యారు. తర్వాత వచ్చిన డివిలియర్స్(22 బంతుల్లో 55) లాంఛనాన్ని పూర్తి చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో త్యాగి, శ్రేయస్ గోపాల్, తెవాతియా తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. 5.4 ఓవర్లలో తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు స్టోక్స్-ఉతప్ప. ఆ తర్వాత 15 పరుగులు చేసిన స్టోక్స్.. ఔటయ్యాడు. కొద్దిసేపటికే ఉతప్ప కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వారిలో స్మిత్(57)తో పాటు శాంసన్(9), బట్లర్(24), రాహుల్ తెవాతియా(19 నాటౌట్), ఆర్చర్(2) రాణించారు. బెంగళూరు బౌలర్లలో మోరిస్ 4, చాహల్ 2 వికెట్లు పడగొట్టారు.