'లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప!' అని పవన్ కల్యాణ్ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ సినీ ప్రియులను ఏ స్థాయిలో మెప్పించిందో తెలుసు కదా.. అలాగే ఆఖరి బంతికి సిక్స్ కొట్టి విజయం సాధించడం కూడా క్రికెట్ అభిమానులకు కనుల పండగగా ఉంటుంది. గతరాత్రి కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా(31*) చివరి బంతిని స్టాండ్స్‌లోకి తరలించి ఆ జట్టును గెలుపు బాట పట్టించాడు. అయితే, ఇంతకన్నా ముందు ఇదే లీగ్‌లో 9 సార్లు అలా చివరి బంతికి సిక్సులు బాది మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అందులో రోహిత్ శర్మ ఒక్కడే మూడు సార్లు అలా గెలిపించడం విశేషం. మిగతావాళ్లంతా ఒక్కసారి మాత్రమే బంతిని బౌండరీ దాటించారు. మరి వాళ్లెవరో.. ఎప్పుడు ఎవరిపై దంచికొట్టారో ఓసారి పరిశీలిద్దాం.
అద'రోహిత్'
2009లో దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్ తొలిసారి చివరి బంతికి కోల్‌కతాపై సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. 161 లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు అవసరం కాగా, మూడు సిక్సులు దంచి కొట్టాడు. చివరి బంతికి సింగిల్ అవసరమైనా బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. ఇక 2011లో పుణె పైనా చివరి బంతికి సిక్సర్‌తోనే గెలిపించాడు. 118 పరుగుల లక్ష్య ఛేదనలో ఐదో బంతికి స్కోర్లు సమం కాగా, ఆరో బంతిని సిక్స్‌గా మలిచాడు. ఇక చివరగా 2012లో దక్కన్ ఛార్జర్స్‌పైనా ఇలాగే ముంబయిని గెలిపించాడు.
రాయుడూ ఓసారి
2011లో ముంబయి టీమ్ తరఫున ఆడిన అంబటి రాయుడు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సర్ బాదాడు. విజయానికి నాలుగు పరుగులే అవసరమైనా లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్‌లో బంతిని దంచికొట్టాడు.
సౌరభ్ కొట్టాడు
2012లో బెంగళూరు తరఫున ఆడిన సౌరభ్ తివారి పుణె వారియర్స్‌పై చివరి బంతికి సిక్సర్ కొట్టి గెలిపించాడు. బెంగళూరు విజయానికి మూడు పరుగులే అవసరమైనా నెహ్రా బౌలింగ్‌లో దంచికొట్టాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌లో పుణె ఓటమిపాలైంది.
తప్పని పరిస్థితుల్లో బ్రావో
2012లోనే కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్‌బ్రావో ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమైన వేళ సిక్సర్‌తో మురిపించాడు. అప్పుడు చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ధోనీ పుణెకు ఆడినప్పుడు..
2016 సీజన్‌లో చెన్నైకి బదులు పుణె తరఫున ఆడిన ధోనీ చివరి బంతికి పంజాబ్‌ను ఓడించాడు. ఆఖరి ఓవర్‌లో 23 పరుగులు అవసరమైన వేళ అక్షర్ పటేల్ బౌలింగ్ చేశాడు. దీంతో ధోనీ అతడికి పీడకల మిగిల్చాడు. తొలుత రెండు సిక్సులు, ఒక బౌండరీ బాదిన అతడు చివరి బంతికి మరో సిక్సర్ కొట్టి పుణెను గెలిపించాడు.
శాంట్నర్ ముగించాడు..
గతేడాది రాజస్థాన్‌తో తలపడిన పోరులో చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమైన వేళ మిచెల్ శాంట్నర్ సిక్సర్ బాదాడు. బెన్‌స్టోక్స్ వేసిన ఈ ఓవర్‌లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరమైన వేళ ధోనీ మూడో బంతికి ఔటయ్యాడు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 9 పరుగులుగా మారింది. చెన్నై ఓటమి లాంఛనమే అనుకున్న పరిస్థితుల్లో నాలుగు, ఐదు బంతులకు రెండేసి పరుగులు వచ్చాయి. ఇక చివరి బంతికి శాంట్నర్ సిక్సర్ బాదడంతో చెన్నై విజయం సాధించింది.
చెలరేగిన నికోలస్ పూరన్
ఈ సీజన్‌లో బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో పంజాబ్ ఆఖరి ఓవర్‌లో రెండు పరుగులు అవసరమైన వేళ అతికష్టం మీద గెలిచింది. క్రీజులో అప్పటికే క్రిస్‌గేల్, రాహుల్ కుదురుకున్నారు. దీంతో ఆ జట్టు తేలిగ్గానే గెలుస్తుందని భావించినా చాహల్ మాయ చేశాడు. బంతిని గింగిరాలు తిప్పడంతో 5 బంతుల్లో ఒకే పరుగు వచ్చింది. ఐదో బంతికి రాహుల్ సింగిల్ తీయబోగా గేల్ రనౌటయ్యాడు. దాంతో చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైన వేళ పూరన్ సిక్సర్‌తో విజయాన్ని అందించాడు.