ఐపీఎల్-2020లో భాగంగా దుబాయ్ వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన పోరులో కోహ్లీ సేన విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన ఆట.. సూపర్ ఓవర్లో గానీ ఫలితం తేల్లేదు. మ్యాచ్ అంతా ఒక ఎత్తు. ముంబయి ఇన్నింగ్స్ చివరి ఐదు ఓవర్లు మరో ఎత్తు. పొట్టి క్రికెట్లో ఉండే మజా ఏంటో టీవీల ముందున్న ప్రేక్షకులకు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్ తమ సత్తా చూపారు. పడక్కల్, ఫించ్, డివిలియర్స్ అర్థ సెంచరీలు చేశారు. దీంతో భారీ స్కోరు సాధ్యమైంది.
ముంబయి జట్టుకు 202 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది ఆర్సీబీ. అయితే ఆటలో మొదటి ఇన్నింగ్స్ ఇరవై ఓవర్లు ఆసక్తిగా సాగితే... రెండో ఇన్నింగ్స్ 15 ఓవర్లు చప్పగానే సాగాయని చెప్పాలి. ఆ తర్వాత మొదలైంది అసలు పోరు. అదే కదా క్రికెట్ అంటే.
రెండు... మూడు... ఒకటి...
రెండు ఓవర్లలో మ్యాచ్‌ని తమ వైపు తిప్పేసుకున్నారు ముంబయి బ్యాట్స్‌మెన్. అవును... 15,16 ఓవర్లలో ముంబయి ఇండియన్ ఆటగాళ్లు అత్యధిక పరుగులు సాధించారు. పొలార్డ్, కిషన్ పోటీ పడి మరీ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అందుకే ఆ ఓవర్లలో సిక్సర్లు, ఫోర్లు తప్ప మిగతావి కనిపించలేదు.
చివరి మూడు ఓవర్లలో ముగించేద్దామని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆడారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. చివరి ఓవర్ తొలి రెండు బంతుల్లో రెండే పరుగులు. ఏమవుతుందోననే ఉత్కంఠ. ఆ తర్వాత కిషన్ కొట్టిన రెండు సిక్సర్లు మ్యాచ్ మళ్లీ ముంబయి వైపు తీసుకెళ్లాయి. అదే ఊపులో మరో భారి షాట్ ఆడబోయి కిషన్ 99పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో.. పొలార్డ్ తన బలంతో ఫోర్ కొట్టాడు. అంతే.. కథ సూపర్ ఓవర్‌కు మారింది. ఆఖరి ఐదు ఓవర్లలో ముంబయి సాధించిన పరుగులు 89. ఇది ఐపిఎల్‌లో ఓ రికార్డు. అదే ముంబయిని సూపర్ ఓవర్ ముంగిట నిలిపింది. మరో అవకాశం ఇచ్చింది.
సూపర్ ఓవర్లో తుస్స్...
ఆట ఆఖరు ఐదు ఓవర్ల కంటే.. సూపర్ ఓవర్లో మరిన్ని మెరుపులు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ రెండు జట్ల నుంచి సికర్స్, ఫోర్లు పెద్దగా లేవు. ముంబయి తరపున పొలార్డ్, పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చారు. కానీ ఒక్క భారీ షాట్ కూడా లేదు. సైని అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పొలార్డ్ కొట్టిన ఫోర్ కూడా ఫీల్డర్ మిస్ ఫీల్డ్‌తో వచ్చిందే. ఆర్సీబీకి 8 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది ముంబయి. అయితే సూపర్ ఓవర్లో ఇషాన్‌ను ఎందుకు ఆడనివ్వలేదన్న ప్రశ్న ముంబయి అభిమానులను కుదిపేసింది.
ఇక బెంగళూరు ఆటగాళ్లు బరిలోకి దిగేసరికి మ్యాచ్ వారి వైపే ఉన్నట్లు స్పష్టంగా అనిపించింది. ఎందుకంటే ప్రపంచ అగ్ర శ్రేణి బ్యాట్స్ మన్ కోహ్లీతో పాటు డివిలియర్స్ క్రీజులోకి వచ్చారు. మొదటి రెండు బంతుల్లో రెండే పరుగులు. ఆ తర్వాత అంపైర్ ఔట్ ప్రకటించినా... రివ్యూతో బయటపడ్డాడు ఏబీడీ. ఆ వెంటనే డివిలియర్స్ ఒక ఫోర్ బాదాడు. లక్ష్యం చాలా చిన్నది. తొందర లేదు. అందుకే సింగిల్ కూడా తీశారు. చివరి బంతికి కోహ్లీ విన్నింగ్ షాట్ ఫోర్ కొట్టి బెంగళూరు ఛాలెంజర్స్ జట్టుని గెలిపించాడు.