"గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది"
"ఊరికే చరిత్ర సృష్టించలేం. అలా అని చరిత్రను ప్లాన్ వేసి బ్లూప్రింట్ తీయలేం. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పు రవ్వ.. కానీ ఆ రోజు కార్చిచ్చు అంటుకుంది"
'కేజీఎఫ్' చిత్రంలోని ఈ రెండు డైలాగ్‌లు.. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ తెవాతియా ప్రదర్శనకు అతికినట్టు సరిపోతాయి.
అతను గాయపడ్డాడు. ఘోర అవమానం ముంగిట నిలిచాడు. తన తోటివారి (శాంసన్, స్మిత్) శ్రమను 'పంజాబ్ పాలు' చేసే పరిస్థితి నుంచి ఒక్కసారిగా పైకి లేచి 'గర్జించాడు'.
13 సీజన్ల ఐపీఎల్‌లోనే అత్యధిక ఛేదనతో చరిత్ర సృష్టించింది రాజస్థాన్. ఈ ఛేదన విజయవంతమవడానికి కావాల్సింది.. ఒకే ఒక్క ఆఖరి నిప్పురవ్వ. కానీ ఆ ఓవర్‌లో కార్చిచ్చే అంటుకుంది. ఐదు సిక్సులతో రెచ్చిపోయాడు తెవాతియా.
తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ కళాత్మక విధ్వంసానికి సారథి కేఎల్ రాహుల్.. అండగా నిలవడం, చివర్లో పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం వల్ల.. పంజాబ్ 223 పరుగుల భారీ స్కోరు సాధించింది.
షార్జా స్టేడియం.. పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. చిన్న బౌండరీలు. రెండో ఇన్నింగ్స్ సమయానికి బంతిపై పట్టు చిక్కకుండా చేసే మంచు. ఇలా ఎన్ని కోణాల్లో చూసినా.. ఓ కొండను ఛేదించేందుకు దిగిన రాజస్థాన్‌కు సానుకూలాంశాలే కనిపించాయి. కానీ ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో, కోట్లాది అభిమానుల ఆశలు మోస్తూ ఆడేటప్పుడు.. 150 అయినా 200 పైచిలుకులాగే కనిపిస్తుంది. అలాంటిది 224 పరుగులు సాధించడమంటే మాటలా అనుకున్నారంతా. ఈ మ్యాచ్‌తోనే బరిలో దిగిన విధ్వంసక జోస్ బట్లర్ ఎలా ఆడతాడన్న దానిపైనే మ్యాచ్ స్వరూపం ఉంటుందని దాదాపుగా అందరి అంచనా. బట్లర్ నిరాశపరిచాడు. కానీ సంజూ క్రీజులోకి రాగానే ఇన్నింగ్స్ టాప్ గేర్‌లోకి వెళ్లిపోయింది. సారథి స్మిత్‌తో కలిసి ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కడా చేయి దాటిపోకుండా చూసుకున్నాడు. 81 పరుగుల భాగస్వామ్యం పూర్తయ్యాక... స్మిత్ వెనుదిరిగాడు.
తెవాతియాకు ప్రమోషన్
సాధారణంగా తెవాతియా ఓ లెగ్ స్పిన్నర్. బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువన వచ్చి ఉపయుక్తమైన పరుగులు చేసే ఓ పించ్‌హిట్టర్. అయితే భారీ ఛేదనలో అతనిపై నమ్మకముంచిన రాయల్స్ యాజమాన్యం.. అతణ్ని నాలుగోస్థానంలో పంపింది. అందుకు కారణమూ లేకపోలేదు. పంజాబ్ బౌలింగ్ దళంలో ఇద్దరు లెగ్‌స్పిన్నర్లు (బిష్ణోయ్, మురుగన్) ఉండగా.. ఎడమ చేతి బ్యాట్స్‌మన్ అయిన తెవాతియా.. వాళ్ల బౌలింగ్‌లో వేగంగా పరుగులు సాధిస్తాడనుకున్నారు. అనుకున్నట్టుగా జరిగితే ఇది మంచి వ్యూహమే అయ్యేది. కానీ తెవాతియా కనీసం బంతికి ఒక పరుగు చేసేందుకే ఇబ్బందిపడ్డాడు. తొలి 19 బంతుల్లో అతను చేసింది కేవలం 8 పరుగులే. అంటే దాదాపుగా టెస్ట్ మ్యాచ్ తరహా బ్యాటింగ్. అతని స్లో బ్యాటింగ్.. సంజు శాంసన్‌పై ఒత్తిడి తీవ్రంగా పెంచేసింది. అందులో భాగంగా.. భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యే ప్రమాదం నుంచి 12 ఓవర్‌లో తృటిలో తప్పించుకున్నాడు.
తొలి దెబ్బ..
భారీ ఛేదనలో సంజూ ఒంటరైపోయాడు. తాను కొట్టే షాట్‌లు ఎక్కడా కనెక్ట్ అవట్లేదు. డగౌట్‌లో ఉన్న తన జట్టు సభ్యుల్లో ఆందోళన. మ్యాచ్ ఓడిపోతే పర్లేదు కానీ సంజూ ఆడిన ఓ అద్భుత ఇన్నింగ్స్‌ను వృథా చేసేలా తన ఆట ఉందన్న ఆలోచనలు. ఆ పరిస్థితుల్లో.. తెవాతియా ఔట్ అయిపోతే బాగుండు అని కోరుకోని రాజస్థాన్ అభిమాని... తెవాతియా క్రీజులో ఉంటే చాలు అని కోరుకోని పంజాబ్ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య... 15వ ఓవర్‌లో తన 20వ బంతికి తొలి బౌండరీ (సిక్స్) కొట్టాడు తెవాతియా. కానీ అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ 16 దాటిపోయింది. 16వ ఓవర్‌లో 3 సిక్సులు కొట్టిన సంజూ.. 17వ ఓవర్ తొలిబంతికి ఔటయ్యాడు. 'ఇక అంతే. తర్వాత చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్ లేరు. తెవాతియా టచ్‌లో లేడు. 3.5 ఓవర్లలో 63 అంటే చాలా కష్టం' అని అనుకుంది క్రికెట్ ప్రపంచమంతా. అయితే..
కాట్రెల్‌కు చుక్కలు
ఇక చావోరేవో తేల్చుకోకపోతే మ్యాచ్ నెగ్గలేమనుకున్న తెవాతియా.. బిష్ణోయ్ వేసిన ఓవర్‌లో సిక్స్ బాది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. తర్వాత కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో శివాలెత్తిపోయాడు. తొలి నాలుగు బంతులకు వరుసగా నాలుగు సిక్సర్లు.అప్పటివరకూ అభిమానుల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొన్న అతను.. ఒక్కసారిగా అందరికీ నచ్చేశాడు. కేవలం నాలుగే నిమిషాల్లో జీరో నుంచి హీరో అయిపోయాడు. యువరాజ్ రికార్డ్ ఒక్కసారిగా అందరి కళ్ల ముందు మెదిలింది. అయిదో బంతికి సిక్స్ మిస్ అయింది కానీ.. ఆరో బంతిని స్టాండ్స్‌లోకి పంపించి.. ఆ ఓవర్‌లో 30 పరుగులు పిండుకున్నాడు. మ్యాచ్‌ను ఒంటిచేత్తో రాజస్థాన్‌వైపు తిప్పాడు. సమీకరణాన్ని 2 ఓవర్లలో 21 పరుగులకు దించేశాడు. తర్వాతి ఓవర్‌లో వచ్చీ రాగానే జోఫ్రా ఆర్చర్ 2 సిక్సులు కొట్టగా.. తర్వాత తన ఏడో సిక్సర్ కొట్టిన తెవాతియా.. 30 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మాములుగా వేరే మ్యాచ్‌ల్లో అయితే.. ఈ లెక్కన హాఫ్ సెంచరీ అంటే సర్వసాధారణమే. కానీ తెవాతియా ఆడిన తొలి 19 బంతులను మినహాయించి చూస్తే.. మరో 11 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్ రెండో దశే మ్యాచ్ గమనాన్ని నిర్దేశించింది. 2 పరుగులు చేయాల్సిన స్థితిలో ఔటైనా.. రాజస్థాన్ విజయతీరాలకు చేరుకుంది.
విపరీతమైన ఒత్తిడిని తట్టుకుంటూ.. తొలుత నెమ్మదిగా ఆడిన తన తప్పునకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటూ.. తన సహచరుడు సంజూ పోరాటం వృథా పోనివ్వకుండా రాహుల్ తెవాతియా ఆడిన ఇన్నింగ్స్.. ఐపీఎల్ చరిత్రలో కచ్చితంగా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే అభిమాలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తూ.. మాజా అందించిన ఈ మ్యాచ్ ఈ లీగ్‌లో ఉత్తమమైన ఒకటిగా నిలుస్తుందనడంలో అనుమానం లేదు.