యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ టైటిల్ రేసులో నిలుస్తుందని అనుకోలేదని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లీగ్ దశలో అనూహ్యంగా మూడు పెద్ద విజయాలు సాధించిన వార్నర్‌సేన గతరాత్రి ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ బెంగళూరును మరోసారి చిత్తు చేసింది. దీంతో రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆకాశ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"వార్నర్ టీమ్‌ను సాధారణ జట్టుగా భావించా. ఎందుకంటే అది టాప్ ఆర్డర్‌లో ఇద్దరు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌పైన, బౌలింగ్‌లో రషీద్ ఖాన్, భువనేశ్వర్ మీదే ఆధారపడుతుందని భావించా. కానీ ఇది క్రికెట్ గేమ్. బాగా ఆడిన వాళ్లు ఇతరుల్ని తప్పని నిరూపిస్తారు. అయితే, హైదరాబాద్ ఇంత దూరం వస్తుందని నేను ఊహించలేకపోయా. ఆ నిజాన్ని ఒప్పుకుంటున్నా. గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా విజయాలు సాధించారు. అందులో రెండుసార్లు బెంగళూరును ఓడించారు."
-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత
అలాగే ఈ మ్యాచ్‌లో సాహా లేకపోవడం వల్ల సన్‌రైజర్స్ ఇబ్బంది పడుతుందని భావించినా మిగతా వాళ్లు అద్భుతంగా ఆడారని మెచ్చుకున్నాడు ఆకాశ్. బౌలింగ్ యూనిట్ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసిందని, హోల్డర్ ఆదిలోనే తన బౌన్స్‌తో వికెట్లు పడగొట్టాడని చెప్పాడు. ఇక షాబాజ్ నదీమ్, రషీద్ ఖాన్ ప్రత్యర్థులను కట్టడి చేశారని ప్రశంసించాడు. బ్యాటింగ్‌లో కాస్త తడబడినా కేన్ విలియమ్సన్, జేసన్ హోల్డర్ బాధ్యతగా ఆడి జట్టును గెలిపించారన్నాడు. హోల్డర్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ విన్నింగ్ షాట్లు ఆడినట్లు చోప్రా గుర్తుచేశాడు.