ఐపీఎల్ అంటేనే పరుగుల సునామి. ప్రపంచంలో ఏ ఆటకూ లేనంత ఆదరణ దీనికుంది. అందుకు ప్రధాన కారణం బ్యాట్స్‌మెన్ల వీర విధ్వంసమే. ప్రపంచ స్థాయి ఆటగాళ్లంతా కలిసి కట్టుగా ఆడే ఈ లీగ్‌లో ఎవరు ఎప్పుడు ఎలా చెలరేగుతారో ఊహించలేము. పలువురు యువ క్రికెటర్లు సైతం ఒక్క ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి మెగా ఈవెంట్‌లో రెండేళ్లుగా 500కిపైగా పరుగులు సాధిస్తూ రాణిస్తున్న ఆటగాళ్లు నలుగురున్నారు.. వారెలా ఆడారో, ఎవరెవరో తెలుసుకుందాం..
రాహులో రాహులా..
కేఎల్ రాహుల్ మూడేళ్లుగా ఈ టీ20 లీగ్‌లో అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. 2018 నుంచీ పంజాబ్ తరఫున ఆడుతున్న అతడు ఈ ఏడాది కొత్తగా కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. గతేడాది అశ్విన్ సారథ్యంలో ఆడిన సందర్భంగా 593 పరుగులు చేయగా ఈసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. మొత్తం 670 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలు జోడించాడు.
అయితే, పంజాబ్ తొలి సగంలో పూర్తిగా నిరాశపర్చడం వల్ల ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లి ఆరోస్థానంతో నిష్క్రమించింది. ఇక 2019లో ఒక శతకం, ఆరు అర్ధశతకాలు బాదగా, ఈ సీజన్‌లోనూ ఒక శతకం, ఐదు అర్ధశతకాలు బాదాడు. స్ట్రైక్‌రేట్ 135.38, 129.34తో రాణించాడు.
ధావన్ శిఖరాగ్రం..
టీమిండియా ఓపెనర్‌గా రోహిత్‌కు జోడీగా విశేషంగా రాణించే శిఖర్ ధావన్ రెండేళ్లుగా దిల్లీ తరఫున అత్యంత కీలకమైన బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్నాడు. ఓపెనర్‌గా పృథ్వీ షాతో బరిలోకి దిగుతూ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది ఐదు అర్ధశతకాలతో రాణించగా ఈసారి రెండు శతకాలు, నాలుగు హాఫ్‌సెంచరీలతో చితకబాదాడు.
టోర్నీ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. 2019లో 135.67 స్ట్రైక్‌రేట్‌తో 521 పరుగులు చేసిన గబ్బర్ 2020లో 144.73 స్ట్రైక్‌రేట్‌తో 618 పరుగులు చేశాడు.
వార్నర్ కసితీరా..
2018లో బాల్‌టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని ఏడాదిపాటు ఆటకు దూరమైన డేవిడ్ వార్నర్.. గతేడాది సరిగ్గా ఐపీఎల్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే బ్యాట్ ఝుళిపించి ఏకంగా ఒక శతకంతో పాటు 8 అర్ధశతకాలు సాధించాడు. దాంతో మొత్తం 692 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక ఈ ఏడాది కూడా 548 పరుగులతో హైదరాబాద్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 4 అర్ధశతకాలున్నాయి. 2019లో 143.86 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించగా ఈసారి అతడి స్టైక్‌రేట్ 134.64గా ఉంది.
డికాకే లేకుంటే..
ఈ టీ20 లీగ్‌లో చెన్నై తర్వాత రెండో ఏడాది టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా ముంబయి నిలిచింది. దిల్లీతో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్ గెలిచింది. అయితే, ముంబయి ఈ రెండేళ్లలో విజేతగా నిలవడంలో ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ ప్రధాన పాత్ర పోషించాడు. వరుసగా రెండు సీజన్లలో 500కిపైగా పరుగులు సాధించాడు. గతేడాది 132.91 స్ట్రైక్‌రేట్‌తో నాలుగు అర్ధశతకాలు సాధించి 529 పరుగులు చేశాడు. తాజా సీజన్‌లోనూ 140.50 స్ట్రైక్‌రేట్‌తో 503 పరుగులు చేశాడు.ఇందులోనూ నాలుగు అర్ధశతకాలే ఉన్నాయి.