ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాచుర్యం పొందింది. ఎంతోమంది యువ ఆటగాళ్ల ప్రతిభ గుర్తించడం సహా ఆర్థికంగా ధనవంతులను చేసింది. పెద్ద ఆటగాళ్లకు మరింత లాభం తీసుకొచ్చింది. అభిమానుల్లో గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఈ లీగ్ యువ క్రికెటర్లకు ఎంతగా ఉపయోగపడుతుందో.. స్టార్ ఆటగాళ్లకు మరింత ఎక్కువగా తోడ్పడుతోంది. వారి ఆర్థిక స్థాయిని అమాంతం పెంచింది. కొందరు ఆటగాళ్లు అయితే ఈ టోర్నీ ద్వారా ఇప్పటకే 100 కోట్లకు పైగా ఆర్జించారు. ఈ క్రమంలో లీగ్ ద్వారా బిలియనీర్లుగా మారిన భారత ఆటగాళ్లెవరో తెలుసుకుందాం.
1) ధోనీ
![IPL 2020: These are the only three players who've earned Rs 100 crore from the tournament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9208082_1.jpg)
ఐపీఎల్ ప్రారంభ సీజన్లోనే ధోనీని రూ.6 కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2016, 2017 సీజన్లలో సీఎస్కేపై నిషేధం విధించడం వల్ల రైజింగ్ పుణె సూపర్జైంట్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 2018 వేలంలో ధోనీని రూ.15 కోట్ల రూపాయలతో చెన్నై యాజమాన్యం మళ్లీ దక్కించుకుంది. దీంతో టోర్నీలో ఇప్పటివరకు కెప్టెన్ కూల్ దాదాపు రూ.137.8 కోట్లతో టోర్నీలో అత్యధికంగా ఆర్జించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
2) రోహిత్ శర్మ
![IPL 2020: These are the only three players who've earned Rs 100 crore from the tournament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9208082_2.jpg)
ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌శర్మను.. ఐపీఎల్ ఆరంభ సీజన్లో రూ.3 కోట్లకు దక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది. ఈ జట్టులో మూడు సీజన్ల పాటు కొనసాగిన తర్వాత హిట్‌మ్యాన్‌ను 2011లో గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా రూ. 9.2 కోట్లకు ముంబయి ఇండియన్స్ వేలంలో కొనుగోలు చేసింది. తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్‌కు 2013లో జట్టు పగ్గాలు అప్పగించింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రూ.15 కోట్లకు ఇతడి ఒప్పంద విలువను మరోసారి పెంచింది ముంబయి. ఫలితంగా టోర్నీలో ఇప్పటివరకు అత్యధికంగా ఆర్జించిన ఆటగాళ్ల జాబితాలో రూ.131.6 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
3) విరాట్ కోహ్లీ
![IPL 2020: These are the only three players who've earned Rs 100 crore from the tournament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9208082_3.jpg)
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కొనసాగుతున్నాడు. యువ బ్యాట్స్‌మన్‌గా జట్టులో చేరిన కోహ్లీ ప్రస్తుతం ఆర్సీబీ సారథిగా వ్యవహరిస్తున్నాడు. టోర్నీలో 12 లక్షల రూపాయలతో ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన కోహ్లీ.. ప్రస్తుత సీజన్లో (రూ.17 కోట్లు) అత్యధిక పారితోషికం పొందుతున్న ఆటగాడిగా ఉన్నాడు. ఈ టోర్నీ ద్వారా అత్యధికంగా ఆర్జించిన ఆటగాళ్ల జాబితాలో రూ.126.2 కోట్లతో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.