టీ20 లీగ్‌లో అత్యధికంగా నాలుగు సార్లు విజేతగా నిలిచి గతేడాది రికార్డు సృష్టించిన ముంబయి.. ఈసారి కూడా కప్పు గెలుస్తామనే ధీమాతో ఉంది. ఆ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇదే విషయాన్ని చెప్పాడు. ముంబయి జట్టు ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేయగా, అందులో హార్దిక్ మాట్లాడాడు. ఇప్పటివరకు తమ ఆటగాళ్లు బాగా ఆడారని, ఇంతకుమించి ఎక్కువ ఆశించలేమని అన్నాడు. ప్రతి సంవత్సరం ఈ లీగ్‌లో తాము మెల్లిగా విజయాల బాట పడుతున్నా ఈసారి విశేషంగా రాణించామని చెప్పాడు. అలాగే తన బ్యాటింగ్‌పై దృష్టిపెట్టానని, సాధన కూడా బాగా జరుగుతోందని పాండ్య అన్నాడు. ఇది తనకో అవకాశం అని, తాను బరిలోకి దిగేటప్పుడు జట్టు ఏం ఆశిస్తుందో అదే ప్రాధాన్యమని పేర్కొన్నాడు.
‘ఇప్పటివరకు అంతా బాగా సాగింది. ప్రతీ ఒక్కరు అవసరమైన వేళ రాణిస్తున్నారు. దాంతో మాకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు అసలైన పోరుకు సమయం ఆసన్నమైంది. కీలక దశకు చేరుకున్నాం. మేం కప్పు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నా’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. కాగా, రోహిత్ నేతృత్వంలో ముంబయి ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ ఎగరేసుకుపోయింది. దీంతో ఈ లీగ్‌లో ఆ జట్టు అత్యంత ప్రభావవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్‌లో రోహిత్‌కు గాయమైనా పోలార్డ్ తన అనుభవంతో విజయాల బాట పట్టించాడు. మరోవైపు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబయి గురువారం దిల్లీతో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఇక్కడ గెలిస్తే ఆ జట్టు నేరుగా ఫైనల్ చేరనుంది.
ఇది చదవండి: దిల్లీxముంబయి : ఫైనల్లో అడుగుపెట్టేదెవరో?