ఐపీఎల్-13వ సీజన్‌లో మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. ఆశల్లేని స్థితి నుంచి గొప్పగా పుంజుకుంది. ఆఖరి ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్లను టపటపా పడగొట్టేసి విజయ దుందుభి మోగించింది. మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ మాయాజాలమే ఇందుకు కారణమని ఆ జట్టు సారథి విరాట్ కోహ్లీ ప్రశంసించాడు.
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ ప్రత్యర్థినే తొలుత బ్యాటింగ్ చేయమంది. మైదానంలోకి వచ్చిన బెంగళూరు ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (56; 42 బంతుల్లో 8×4), ఆరోన్ ఫించ్ (29; 27 బంతుల్లో 1×4, 2×6) మొదట్లో నెమ్మదిగా ఆడినా తర్వాత విజృంభించారు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ (51; 30 బంతుల్లో 4×4, 2×6) మెరుపు అర్ధశతకం చేయడం వల్ల కోహ్లీసేన 163/5తో నిలిచింది. ఛేదనలో సన్‌రైజర్స్ తొలుత అదరగొట్టింది. వార్నర్ (6) అనూహ్య రీతిలో రనౌట్ అయినా జానీ బెయిర్‌స్టో (61; 43 బంతుల్లో 6×4, 2×6)), మనీశ్ పాండే (34; 33 బంతుల్లో 3×4, 1×6) మెరవడంతో 15 ఓవర్లకు 121/2తో నిలిచింది.
సన్‌రైజర్స్ ఆశలపై నీళ్లు..
ఇదే సమయంలో చాహల్ విజృంభించాడు. ఊహించని రీతిలో వరుస బంతుల్లో బెయిర్‌స్టో, విజయ్ శంకర్‌ను ఔట్ చేశాడు. అంతకు ముందు మనీశ్‌నూ అతడే పెవిలియన్ చేర్చాడు. చివరి ఐదు ఓవర్లలో విజయానికి 43 పరుగులు చేయాల్సిన క్రమంలో హైదరాబాద్ పేకమేడలా కూలిపోయింది. 32 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను చేజార్చుకుంది. ఈ సందర్భంగా అద్భుతంగా రాణించిన యూజీని కోహ్లీ అభినందించాడు.
గర్వంగా చెబుతున్నా
"యూజీ వచ్చి మాయచేశాడు. మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మలుపు తిప్పాడు. ప్రతిభ ఉంటే ఎలాంటి పిచ్‌పై అయినా వికెట్లు తీయగలరని నిరూపించాడు. కట్టుదిట్టమైన లైన్, లెంగ్త్‌తో బంతులు విసిరాడు. అందుకే అతడే ఆటను మార్చేశాడని గర్వంగా చెబుతున్నా. ఇక ఏబీ, పడిక్కల్ బాగా ఆడటంతోనే మేం 160 స్కోర్ దాటగలిగాం" అని విరాట్ చెప్పాడు.