ఐపీఎల్ నుంచి దిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వైదొలిగాడు. షార్జా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వేలు విరగడం వల్ల అతడు విశ్రాంతి కోసం టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ జట్టు అధికారి ఒకరు స్పష్టం చేశారు.
అక్టోబరు 3న కేకేఆర్ బ్యాట్స్‌మన్ నితీశ్ రానా కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకునే క్రమంలో అమిత్ మిశ్రా వేలికి గాయమైంది. ఆ నొప్పిని భరిస్తూనే తర్వాతి రెండు ఓవర్లు వేసి శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేశాడు.
"కోల్‌కతాపై ఆడుతున్న మ్యాచ్‌లో అమిత్ మిశ్రా ఉంగరపు వేలు విరిగిపోయింది. దీంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించనున్నాడు. టోర్నీ నుంచి అమిత్ తప్పుకోవడం మాకు చాలా నిరాశ కలిగించింది"
- దిల్లీ క్యాపిటల్స్ అధికారి
అమిత్ మిశ్రాకు విరిగిన వేలుకు సంబంధించిన వైద్యంతో పాటు భారత్‌కు తిరిగి వెళ్లడంపై నిపుణుడిని సంప్రదిస్తామని దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఓ అధికారిక ప్రకటన చేసింది.
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో అమిత్ మిశ్రా.. దిల్లీ క్యాపిటల్స్ తరఫున మూడు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 2 వికెట్లు తీసి 25 రన్స్ ఇవ్వగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఒక వికెట్ పడగొట్టి 14 పరుగులు సమర్పించాడు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై వికెట్ సాధించక పోయినా.. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు మిశ్రా.
అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో వ్యక్తిగా అమిత్ మిశ్రా(160) ఘనత సాధించాడు. ఆ జాబితాలోని అగ్రస్థానంలో లసిత్ మలింగ (170) ఉన్నాడు.