ఐపీఎల్లో హైదరాబాద్ ఓపెనర్, విధ్వంసక బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. 50 సార్లు 50కిపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
దుబాయ్‌లో గురువారం, హైదరాబాద్-పంజాబ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 69 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్నర్‌సేన.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్(52), బెయిర్‌స్టో(97) చెలరేగిపోయారు. దీంతో తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇద్దరూ అర్ధశతకాలతో విధ్వంసం సృష్టించారు. ఛేదనలో పంజాబ్ 132 పరుగులకే కుప్పకూలింది.
2009 నుంచీ లీగ్‌లో ఆడుతున్న వార్నర్.. ఇప్పటికే మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2018లో బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు ఆటకు దూరమవ్వగా ఆ ఒక్క సీజన్‌లో ఆడలేదు. నిషేధం పూర్తిచేసుకొని గతేడాది నేరుగా ఐపీఎల్లో పాల్గొన్నాడు. వచ్చీ రాగానే 12 మ్యాచ్‌ల్లో 692 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే పంజాబ్‌పై అతడికి ఇది వరుసగా తొమ్మిదో అర్ధశతకం కావడం విశేషం. ఇది కూడా ఇంకో రికార్డు.
వార్నర్ 132 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, తర్వాతి స్థానంలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతడు 174 ఇన్నింగ్స్‌ల్లో 42 సార్లు 50కి పైగా పరుగులు తీశాడు. మూడో స్థానంలో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా 189 ఇన్నింగ్స్‌ల్లో 39 సార్లు ఈ ఘనత సాధించారు. నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్(బెంగళూరు) 147 ఇన్నింగ్స్‌ల్లో 38 సార్లు సాధించాడు.