Hezbollah Main Spokesman killed : హెజ్బొల్లాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా ప్రధాన ప్రతినిధి (మెయిన్ స్పోక్స్మ్యాన్) మహమ్మద్ అఫిఫ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సెంట్రల్ బీరుట్‌పై టెల్అవీవ్ సేనలు దాడి చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
అనేక సంవత్సరాలుగా మహమ్మద్ అఫిఫ్ - హెజ్బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ తన దాడులను ఉద్ధృతం చేయడం సహా, సంస్థ అధిపతి హసన్ నస్రల్లాను హతమార్చడం లాంటి కీలక పరిణామాల అనంతరం బాహ్యప్రపంచంలో అఫిఫ్ ఎక్కువగా కనిపించారు. ఇదిలా ఉండగా మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్న వేళ ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
గాజాలో 12 మంది మృతి
మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు.
నెతన్యాహు ఇంటిపై దాడి
అంతకు ముందు ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. రెండు ఫ్లాష్ బాంబులతో దాడి చేయగా, అవి నెతన్యాహు ఇంటి గార్డెన్లో పేలినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశామని, షిన్ బెట్‌తో కలిసి నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.