అబుదాబి వేదికగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన తొమ్మిదింటిలో ఆరింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తాము ఆడిన గత మ్యాచుల్లో ఓడిన ఇరుజట్లు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ప్లేఆఫ్ అవకాశం చేజారిపోతుంది. దీంతో ఇరుజట్లు ఈ పోరును చావోరేవోగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
గెలవాలనే కసితో
చెన్నై జట్టు విజయం కోసం తహతహలాడుతోంది. గత మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై గెలవడానికి చివరిదాకా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డుప్లెసిస్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వాట్సన్, జడేజా, రాయుడు బాగానే రాణించారు. గత మ్యాచుల్లో బౌలర్లు చాహర్, సామ్ కరణ్, శార్దూల్ ఠాకూర్, బ్రావో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ దిల్లీతో జరిగినా మ్యాచ్‌లో వారి సత్తా సరిపోలేదు. ఏదేమైనప్పటికీ జట్టు సమష్టిగా రాణిస్తేనే తప్ప విజయాన్ని అందుకోవడం కష్టం. కాబట్టి ఇకపై ఆడే ప్రతి మ్యాచులోనూ విజృంభించాలి. లేదంటే ప్లేఆఫ్స్ అవకాశాలు చేజార్చుకున్నట్లే.
రాయల్స్ కూడా ఇదే తంతు
రాయల్స్ కూడా సీఎస్కే బాటలోనే నడుస్తోంది. విజయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది. ఫ్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఈ జట్టులో ఓపెనర్లు సరిగ్గా ఆడలేకపోతున్నారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు. కానీ గత మ్యాచ్‌లో ఉతప్ప, సారథి స్మిత్ బాగానే ఆడారు. అయితే బౌలర్లు రాణించినా సరే ఫలితం లేకుండా పోతోంది. ఇలాంటి సమయంలో రాయల్స్ ఏం చేస్తుందో చూడాలి.
జట్లు (అంచనాలు)
చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, పీయూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్, కరన్ శర్మ.
రాజస్థాన్ రాయల్స్
స్టోక్స్, జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, కార్తీక్ త్యాగి
ఇదీ చూడండి 'తెవాతియా.. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టగలడు!'