దిల్లీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైశ్వాల్ (34) ఫర్వాలేదనిపించినా భారీ స్కోరు చేయలేకపోయాడు. అతడి స్ట్రైక్‌రేట్ నిరాశ కలిగించడం వల్ల నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమవుతున్న చెన్నై బ్యాట్స్‌మెన్ ధోనీ, కేదార్ జాదవ్‌లతో పోలుస్తూ ఆటపట్టిస్తున్నారు. అయితే, ఈ విషయంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తీవ్రంగా స్పందించాడు. జైశ్వాల్‌ను ట్రోలింగ్ చేసిన ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేసి మొదట వినయంగా చెప్పాడు. జైశ్వాల్ ఇంకా యువ క్రికెటర్, అతడిని ట్రోలింగ్ చేయకుండా వదిలేయాలని కోరాడు. ఇలాంటి ట్రోలింగ్‌లను సీనియర్ క్రికెటర్లు పెద్దగా పట్టించుకోకపోయినా, 19 ఏళ్ల కుర్రాడికి బాధ కలిగిస్తుందని చెప్పాడు.
చోప్రా ట్వీట్‌కు మరో నెటిజన్ స్పందిస్తూ ట్రోలింగ్ చేయడం సరికాదన్నప్పుడు.. జైశ్వాల్ మంచి ప్రదర్శన ఎలా చేస్తాడని ప్రశ్నించాడు. దీనికి మాజీ క్రికెటర్ తనదైన శైలిలో బదులిచ్చాడు. సోషల్ మీడియా ఆవిర్భావం కన్నా ముందు నుంచే క్రికెట్ ఆడుతున్నారని.. దాంతో ట్రోలింగ్‌కు, అత్యుత్తమ ప్రదర్శనకు పోలికే లేదన్నాడు. ఈ సందర్భంగా మరో ట్వీట్ చేసిన చోప్రా.. ఆ నెటిజన్‌పై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 19 ఏళ్ల క్రికెటర్‌ను ట్రోల్ చేసేముందు.. ఆ వయసులో నువ్వేం చేశావో గుర్తు తెచ్చుకో అన్నాడు. నువ్వు ఆటపట్టించే జైశ్వాల్ ఇప్పటికే టీమ్‌ఇండియా తరఫున అండర్-19 ప్రపంచకప్ ఆడాడని, అలాగే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడని పేర్కొన్నాడు. ఇక లిస్ట్ ఏ క్రికెట్‌లో ముంబయి తరఫున డబుల్ సెంచరీ సాధించి ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్నాడని గుర్తు చేశాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన యశస్వి జైశ్వాల్, మొత్తం 40 పరుగులే చేశాడు. నిన్న దిల్లీపై సాధించిన 34 పరుగులే అత్యధిక స్కోరు. దేశవాళీ క్రికెట్‌లో అతడికి మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే అతడు ధాటిగా ఆడి పరుగులు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఈ లీగ్ ఆడుతున్న జైశ్వాల్ టోర్నీలో నిలదొక్కుకోడానికి సమయం పట్టే అవకాశం ఉంది.