Indian origin cricketers who played for other countries: టీమ్ఇండియా తరఫున ఆడాలని ఎందరో భారతీయులు కలలుగంటారు. అవకాశాల కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అయితే మన దేశంలో పుట్టి, లేదా మన దేశ మూలాలు కలిగి.. భారత్ తరఫున కాకుండా విదేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ స్టార్లుగా మారిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్న ఆ క్రికెటర్లపై ఓ లుక్కేయండి..
హషీమ్ ఆమ్లా..
హషీమ్ ఆమ్లా తండ్రిది గుజరాత్. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఆయన సెటిల్ అయిన తర్వాత హషీమ్ అక్కడే జన్మించాడు. 21 ఏళ్ల వయసులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సఫారీల తరఫున టీమ్ఇండియాపైనే అరంగేట్రం చేశాడు హషీమ్. 2006 నుంచి రెగ్యులర్‌గా జట్టులో కొనసాగిన అతడు.. వన్డేలో అత్యధిక వేగంగా 7వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు.
నాసర్ హుస్సేన్..
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్.. భారత్‌లోనే పుట్టాడు. స్వస్థలం మద్రాస్. తమిళం మాట్లాడే ముస్లిం కుటుంబం వారిది. అతడి ఏడేళ్ల వయసులో వారి కుటుంబం ఇంగ్లాండ్ వెళ్లిపోయింది.
ఇంగ్లీష్ జట్టు తరఫున 1989లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు నాసర్. 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన బ్యాటర్‌గా ఉన్న అతడు .. భారత్‌లోనే పుట్టాడని చాలా మందికి తెలియదు.
రామ్‌నరేశ్ సర్వన్..
టీమ్ఇండియాపై ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఆడిన రామ్నరేశ్కు భారతీయ మూలాలుండటం విశేషం. అతడి కుటుంబం గుయానాలో స్థిరపడింది. ఆ తర్వాత విండీస్ తరఫున వన్డేలు, టెస్టుల్లోనూ దాదాపు 6 వేల పరుగులు చేశాడు సర్వన్. కరీబియన్ జట్టుకు సారథిగానూ ఉన్నాడు. 2016లో రిటైరయ్యాడు.
ఎస్ చాండర్పాల్..
భారత్‌లో కార్మిక వ్యవస్థ కారణంగా చాండర్పాల్ పూర్వీకులు.. వెస్టిండీస్‌కు వలస వెళ్లాల్సి వచ్చింది. వారు గుయానాలో సెటిల్ అయ్యారు. 1994లో అరంగేట్రం చేసిన పాల్.. సుదీర్ఘంగా 21ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు. అత్యధికంగా 164 టెస్టులాడాడు. విండీస్ తరఫున రెండో అత్యధిక పరుగుల వీరుడు. రెండు ఫార్మాట్లలో కలిపి 20వేల పైచిలుకు పరుగులు చేశాడు.
రవి బొపారా..
సిక్కు కుటుంబానికి చెందినవాడు రవి బొపారా. ఇంగ్లాండ్‌లోనే పుట్టి పెరిగాడు. 2007లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో వరుస శతకాలు బాదిన అతికొద్ది మంది ఇంగ్లీష్ క్రికెటర్లలో ఇతడొకడు.
సునీల్ నరైన్..
ఇతడి స్పిన్ ఇప్పటికీ మిస్టరీగానే ఉంటుంది. విండీస్ జట్టులోని పలువురు క్రికెటర్లలానే ఇతడికీ భారతీయ మూలాలున్నాయి. అతడి భార్య కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే. అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడనప్పటికీ.. ఫ్రాంఛైజీ క్రికెట్లో అతడో స్టార్. తన బౌలింగ్ యాక్షన్‌తో మేటి బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెడుతుంటాడు.
రవి రాంపాల్..
రవి రాంపాల్.. పూర్వికులది పంజాబ్. అతడు ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగాడు. 2011 ప్రపంచకప్‌లో విండీస్ తరఫున ఐదుగురు భారత క్రికెటర్ల వికెట్లు తీయడం అతడి అత్యుత్తమ ప్రదర్శన. అందులో సచిన్ తెందూల్కర్ వికెట్ కూడా ఉంది. ఇదేకాక, 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు (86*) చేసిన మొదటి క్రికెటర్ ఇతడు.
ఇష్ సోధీ..
ఇటీవలి కాలంలో బాగా రాణిస్తున్న న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధీ. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు ఆడిన 66 మ్యాచుల్లో 83 వికెట్లు పడగొట్టాడు. అతడు భారత్‌లోనే పుట్టాడని చాలా కొద్ది మందికి తెలుసు. 1996లో వారి కుటుంబం న్యూజిలాండ్ వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే నివసిస్తున్నారు.
స్టువర్ట్ క్లార్క్..
ఆస్ట్రేలియా తరఫున సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లేనప్పటికీ.. ఆడినంత కాలం అత్యుత్తమ ప్రదర్శన చేశాడు క్లార్క్. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా ఉండే అతడు.. 30 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు. 24 టెస్టుల్లోనే 94 వికెట్లు పడగొట్టాడు. కొంచెం ముందుగా కెరీర్‌ను ఆరంభించి ఉంటే.. జట్టు తరఫున కచ్చితంగా గొప్ప ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగి ఉండేవాడని విశ్లేషకుల అభిప్రాయం. అంత నిలకడైన ప్రదర్శన చేసేవాడు.
రచిన్ రవీంద్ర
కివీస్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర. అతడి తల్లిదండ్రులది భారతే. వెల్లింగ్టన్లో పుట్టాడు రచిన్. క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్ల మీదుగా అతడికీ పేరు పెట్టారని చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం భారత్‌లో కివీస్ పర్యటనలో అతడు టెస్టు అరంగేట్రం చేశాడు.
అజాజ్ పటేల్..
2018 అక్టోబర్‌లో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేసిన అజాజ్ పటేల్.. పుట్టింది ముంబయిలోనే. ఆ మరుసటి నెలలోనే టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. అజాజ్‌కు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు అతడి కుటుంబం న్యూజిలాండ్‌లో స్థిరపడింది.
ముత్తయ్య మురళీధరణ్
ఈ జాబితాలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం పేరు చూసి షాకయ్యారా? 1920లలో టీ ప్లాంటేషన్‌లో పనిచేయడానికి అతడి తాత.. దక్షిణ భారతదేశం నుంచి లంకకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆయన తిరిగి భారత్‌కు వచ్చినా.. మురళీధరణ్ నాన్నవాళ్లు అక్కడే ఉండిపోయారు. ఆల్‌టైమ్ స్పిన్ దిగ్గజంగా ఉన్న మురళీధరణ్.. టెస్టుల్లో అసాధారణంగా 800 (muttiah muralitharan stats) వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 534 వికెట్లు తీశాడు.
ఇవీ చూడండి:
చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారత ఆటగాడిగా!