india Vs Sl second Test: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డే నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 252 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే అర్ధ సెంచరీ(92)తో రాణించి ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దేనియా, జయవిక్రమ మూడేసి వికెట్లు, దనంజయ డిసిల్వ 2 వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు రెండో ఓవర్లలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 7 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే 15 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత శర్మ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఎంబుల్డేనియా బౌలింగ్లో దనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత 31 పరుగులు చేసిన హనుమ విహారి.. జయవిక్రమ బౌలింగ్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్ది సేపటికే కోహ్లీ 23 పరగుల చేసి దనంజయ డిసిల్వ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరికాడు. దీంతో
టీ బ్రేక్ సమయానికి 93 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది టీమ్ ఇండియా.
అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్..
ఆ తర్వాత ధాటిగా ఆడుతున్నట్లు కనిపించిన రిషభ్ పంత్ 39 పరుగులు చేసి ఎంబుల్డేనియా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓ వైపు శ్రెయస్ అయ్యర్ పరుగులు రాబడుతున్నా.. అవతలి ఎండ్‌లో సహకరించే వారు లేరు. పంత్ ఔటయ్యాక జడేజా(4), అశ్విన్(13), అక్షర్ పటేల్(9), షమి(5) పరుగులకే టక టకా ఔటయ్యారు. అయ్యర్ మాత్రం తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ అర్ధశతకం పూర్తి చేశాడు. చివరివరకు పోరాడాడు. ఈ క్రమంలోనే 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జయవిక్రమ బౌలింగ్లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
కోహ్లీ మళ్లీ నిరాశ..
తనకు అచ్చొచ్చిన చిన్నస్వామి స్టేడియంలోనైనా ఈసారి సెంచరీ చేస్తాడని అశించిన అభిమానులకు మరోసారి నిరాశే మిగిల్చాడు విరాట్ కోహ్లీ. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొంటూ క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా.. డిసిల్వ వేసిన ఓ అనూహ్య బౌంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి అంచనా వేసిన దానికంటే తక్కువ ఎత్తులో రావడం వల్ల ఔట్ అయ్యాడు. దీంతో కోహ్లీ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. బంతి కచ్చితంగా వికెట్లను తగిలే అవకాశం ఉన్నందున రివ్యూ కూడా తీసుకోకుండా వెనుదిరిగాడు.
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంతో ఉంది టీమ్ఇండియా.
ఇదీ చదవండి: అదరగొట్టిన అమ్మాయిలు.. విండీస్‌పై భారీ విజయం