India Vs SouthAfrica Series: టీమ్‌ఇండియా.. కీలకమైన రెండో వన్డేలో ఆదివారం దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. టీ20 ప్రపంచకప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ ఆస్ట్రేలియాలో ఉన్న రోహిత్‌సేనపైనే. అయితే దక్షిణాఫ్రికాతో ధావన్ బృందం ఆడుతున్న ఈ సిరీస్ ఇతర ఆటగాళ్లు సత్తా చాటుకోవడానికి చక్కని అవకాశం. తొలి వన్డేలో ఓడి సిరీస్‌లో వెనుకబడ్డ జట్టు ఎలా పుంజుకుంటుందో చూడాలి.
బౌలింగ్ మారితేనే..
గెలిచి సిరీస్‌లో నిలవాలనుకుంటున్న టీమ్ ఇండియాకు బౌలింగే సమస్య. వెన్ను గాయంతో తాజాగా దీపక్ చాహర్ కూడా దూరం కావడంతో ఇబ్బంది మరింత పెరిగింది. తుది జట్టు ఎంపికే సంక్లిష్టమైంది. బౌలర్లు ఏమేర రాణిస్తారన్నదానిపైనే భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. చాహర్ తొలి వన్డేలోనూ ఆడలేదు. ఫాస్ట్‌బౌలర్లు మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ ఇప్పటివరకు ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇంకా అరంగేట్రం చేయని బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్‌కు అవకాశం దక్కొచ్చు. ఇక బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ రాణించడం అతడికి, జట్టుకు చాలా ముఖ్యం. అతడు టీ20 ప్రపంచకప్‌నకు స్టాండ్‌బైగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్.. తొలి వన్డేలో టాప్ ఆర్డర్ కుప్పకూలిన భారత్‌ను ఆదుకున్న సంగతి తెలిసిందే. షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో తడబడే బలహీనత ఉన్న శ్రేయస్ ఎదురుదాడికి దిగాడు. అయితే మొదటి వన్డేలో భారత్‌కు అతి పెద్ద సానుకూలాంశం మాత్రం సంజు శాంసన్ ప్రదర్శనే. చాలా పరిణతితో ఆడిన అతడు కేవలం 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ముచ్చటైన షాట్లతో అలరిస్తూ జట్టును గెలిపించడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. అతడు ఫామ్‌ను కొనసాగిస్తాడని జట్టు ఆశిస్తోంది. ఇక కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా మంచి ఆరంభాన్నివ్వాలని జట్టు కోరుకుంటోంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ వన్డే ఓపెనర్‌గా తాను తగినవాడినని మరోసారి చాటి చెప్పాలనుకుంటున్నాడు. రవి బిష్ణోయ్ స్థానంలో ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చే అవకాశముంది.
ఉత్సాహంగా దక్షిణాఫ్రికా
మరోవైపు దక్షిణాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే కెప్టెన్ బవుమా ఫామ్ ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. టీ20ల్లో వరుసగా 0, 0, 3 చేసిన అతడు.. మొదటి వన్డేలో 8 పరుగులకే ఔటయ్యాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో తిరిగి పరుగుల బాట పట్టాలనే పట్టుదలతో అతడు ఉన్నాడు. డేవిడ్ మిల్లర్, కాస్లెన్, డికాక్‌ల సూపర్ ఫామ్ దక్షిణాఫ్రికాకు సానుకూలాంశం. టీ20ల్లో తడబడ్డ రబాడ నేతృత్వంలోని పేస్ దళం మళ్లీ గాడిన పడ్డట్లే కనిపిస్తోంది.
పిచ్..
వర్షం కారణంగా తొలి వన్డేలో ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. రెండో వన్డే సందర్భంగా కూడా వాన పడే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. మ్యాచ్ వేదిక జేఎస్‌సీఏ స్టేడియంలోని పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. గత అయిదు వన్డేల్లో మూడుసార్లు మొదటి ఇన్నింగ్స్‌లో 280+ స్కోర్లు నమోదయ్యాయి.
చలి కాచుకుంటూ.. కసరత్తులు చేస్తూ
టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు కసరత్తుల్లో మునిగిపోయారు. పెర్త్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే టోర్నీలో ప్రత్యర్థి జట్ల కంటే ముందు అక్కడి చలి వాతావరణం టీమ్‌ఇండియా క్రికెటర్లకు సవాలు విసురుతోంది. ఈ నెల 16న ప్రపంచకప్ ఆరంభమయ్యే నాటికి అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం చలి భారత క్రికెటర్లను వణికిస్తోంది. తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడబోతున్న దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్‌తో చాహల్ సరదాగా ముచ్చటించిన వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది. అందులో చాహల్ వెచ్చదనం కోసం జాకెట్ వేసుకుని, హర్షల్ టీ తాగుతూ కనిపించారు. అక్కడ చాలా చలిగా ఉందని, ఓ కప్పు టీ అత్యవసరమని చాహల్ తెలిపాడు. తాము క్రమంగా ఈ వాతావరణానికి అలవాటు పడతామని హర్షల్ అన్నాడు. భారత్‌లోని ఇండోర్‌లో 22 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత మధ్య దక్షిణాఫ్రికాతో మూడో టీ20 ఆడిన తర్వాత రోహిత్ సేన ఆస్ట్రేలియా విమానమెక్కింది. ఇప్పుడక్కడ పెర్త్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా ఉంది. ఈ నెల 13 వరకు అది 8 డిగ్రీలుగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు తొలిసారి ప్రపంచకప్ ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జట్టుకు విజయాలు అందిస్తామని హర్షల్, దీపక్, అర్ష్‌దీప్ చెప్పారు. ఈ నెల 23న పాక్‌తో పోరుతో టీమ్‌ఇండియా కప్పు వేట మొదలెడుతుంది.
ఈ 8-10 రోజులు ఎంతో కీలకం!
కొన్నేళ్ల నుంచి టీమ్‌ఇండియా ఐసీసీ ఈవెంట్లకు హడావుడిగా వెళ్తోందని, ఈసారి టీ20 ప్రపంచకప్‌కు అలా కాకుండా చాలా ముందుగానే ఆస్ట్రేలియాకు చేరుకోవడం కలిసొస్తుందని భారత క్రికెట్ జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 23న ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుండగా.. దానికి రెండు వారాల ముందే పెర్త్‌కు చేరుకుంది. ఇక్కడ ప్రాక్టీస్ సెషన్లకు తోడు వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడబోతోంది టీమ్‌ఇండియా. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో సోహమ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ ఆరంభానికి ముందు, రాబోయే 8-10 రోజులు మాకెంతో కీలకం. ప్రపంచకప్ సన్నద్ధత కోసం జట్టుకు ఈ సమయాన్ని కేటాయించినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు. భారత జట్టు కొన్నేళ్లుగా విపరీతమైన క్రికెట్ ఆడుతూ.. పెద్ద టోర్నీలు వచ్చినపుడు హడావుడిగా వాటి కోసం వెళ్తోంది. కానీ ఈసారి చాలినంత సమయం దొరుకుతోంది. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ మొదలయ్యేలోపు ఆటగాళ్లందరూ శారీరకంగా, మానసికంగా బలంగా తయారవడానికి అవకాశం దక్కుతోంది’’ అని చెప్పాడు.