India Vs Australia 4th T20 Raipur Stadium : రాయ్‌పుర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ వేళ మైదానంలో కొన్ని చోట్ల విద్యుత్ వెలుగులు ఉండకపోవచ్చు. ఈ స్టేడియాన్ని కొంతకాలం నుంచి విద్యుత్ కష్టాలు వెంటాడుతుండటమే ఇందుకు కారణం. గత కొన్నేళ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల స్టేడియంలో కరెంట్ సరఫరా లేదు. దీంతో నేటి మ్యాచ్‌ను జనరేటర్లతో నడిపించనున్నారని తెలుస్తోంది.
ఈ స్టేడియం నిర్మించిన తర్వాత.. నిర్వహణ బాధ్యతను ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)కి అప్పగించారు. ఇక మిగతా ఖర్చులను క్రీడా శాఖ భరిస్తోంది. అయితే, 2009 నుంచి ఈ స్టేడియం కరెంట్ బిల్లులను చెల్లించట్లేదు. ఆ బకాయిలు పెరిగి రూ.3.16 కోట్లకు చేరాయి. బకాయిల గురించి పీడబ్ల్యూడీ, క్రీడా శాఖకు పలు సార్లు నోటీసులు పంపించినా.. ఆ వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు.
జనరేటర్లతో దిక్కు..
Raipur Stadium Electricity Cut : దీంతో చేసేదేం లేక, 2018లో ఈ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో ఇక్కడ హాఫ్-మారథాన్‌ను నిర్వహించారు. మైదానంలో కరెంట్ సరఫరా లేకపోవడం వల్ల ఇందులో పాల్గొన్న అథ్లెట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు స్టేడియంలో తాత్కాలిక కనెక్షన్ ఏర్పాటు చేశారు. అయితే, ఆ కరెంట్ కేవలం స్టేడియంలోని గదులు, వీక్షకుల గ్యాలరీ, బాక్సుల్లో లైట్లకు మాత్రమే సరిపోతుంది. దీంతో మైదానంలో ఫ్లడ్ లైట్ల కోసం ప్రత్యేక జనరేటర్లు ఉపయోగించాల్సివస్తోంది.
"2010లో పీడబ్ల్యూడీ డిపార్ట్‌మెంట్.. క్రికెట్ కన్‌స్ట్రక్షన్ కమిటీ పేరుతో కనెక్షన్ తీసుకుంది. 2018 వరకు రూ.3. 16 కోట్ల బకాయిలు ఉన్నాయి. కానీ పీడబ్ల్యూడీ వాటిని చాలా కాలంగా చెల్లించలేదని, వాటి కనెక్షన్ తొలగించారు. ఆ తర్వాత పెండింగ్ బిల్లు చెల్లింపుల కోసం వారితో నిరంతరం సంప్రదింపులు జరిపాం. కానీ బకాయిలు చెల్లించలేదు. ఆ తర్వాత ఈ బకాయిల మొత్తాన్ని క్రీడ, యువజన సంక్షేమ శాఖ చెల్లిస్తుందని చెప్పారు. ఆ శాఖతో కూడా సంప్రదింపులు జరిపాం"
--అశోక్ ఖండేల్వాల్, రాయ్‌పూర్ రూరల్ డివిజన్ ఇంచార్జి, విద్యుత్ శాఖ
Raipur Stadium Electricity News : అయితే 2018 తర్వాత నుంచి ఇక్కడ మూడు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. మ్యాచ్‌లు జరిగినన్ని సార్లు తాత్కాలిక కనెక్షన్, జనరేటర్లతోనే విద్యుత్ సమకూర్చుకుని ఫ్లడ్లైట్స్ వంటివి నడిపించారు. తాజా మ్యాచ్‌కు తాత్కాలిక కనెక్షన్ సామర్థ్యాన్ని పెంచాలని క్రికెట్ అసోసియేషన్ సంబంధిత అధికారులను కోరింది. అయితే అందుకు అనుమతులు లభించినా.. ఎలాంటి పనులు చేపట్టలేదు. దీంతో టీమ్ఇండియా, ఆసీస్ మ్యాచ్‌కు కూడా జనరేటర్లతోనే ఫ్లడ్‌లైట్లను వెలిగించనున్నట్లు అసోసియేషన్ తెలిపింది.
2024 టీ20 వరల్డ్ కప్‌నకు మేము ఆతిథ్యం ఇవ్వలేం : డొమినికా
'అవసరమైతే వరల్డ్‌కప్‌పై మళ్లీ కాళ్లు పెడతా'- మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు!