India Vs Australia 4th T20 : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో సూర్య కుమార్ సేన ఓటమిని చవి చూసింది. భారీ స్కోరును నమోదు చేసినప్పిటికీ దాన్ని కాపాడుకోవడంలో భారత జట్టు విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. 222 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇక ఓపెనర్‌గా దిగిన ట్రావిస్ హెడ్ ఆసిస్ జట్టుకు మంచి ఆరంభం అందించాడు. అయితే టీమ్ఇండియా బౌలర్ల ధాటికి వెంటనే మూడు వికెట్లు పడ్డాయి. దీంతో ఆసీస్ ఒత్తిడిలోకి వెళ్లింది. కానీ అప్పుడే రంగంలోకి దిగిన వచ్చిన ఆసిస్ ప్లేయర్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ మన బౌలర్లను హడలెత్తించాడు. 48 బంతుల్లో 104 పరుగులతో రాణించాడు. తన ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను విజయపథంలోకి నడిపించాడు. అయితే బ్యాటర్లను కట్టడి చేయలేక టీమ్ఇండియా ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత టీమ్ఇండియాలో పలు మార్పులు జరగనున్నాయి.
రాయ్‌పూర్ వేదికగా డిసెంబరు 1న నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం శ్రేయస్ అయ్యర్ తుది జట్టులోకి చేరనున్నాడు. అతడ్ని వైస్ కెప్టెన్‌గా నియమించనున్న సంగతి తెలిసిందే. అయితే శ్రేయస్ టాప్ ఆర్డర్‌లో రావాలంటే.. ఎవరో ఒకరు తప్పుకోవాల్సిందే. కానీ రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఈ ముగ్గురిలో ఏ ఒక్కరిని తప్పించడానికి మేనేజ్‌మెంట్ కోరుకోవట్లేదు. దీంతో అయ్యర్‌కు ప్లేస్ ఇచ్చేందుకు తెలుగు కుర్రాడు తిలక్ వర్మను పక్కన పెట్టేయాలని అనుకుందట. తిలక్‌తో పాటు మరో బౌలర్లపై కూడా కఠిన నిర్ణయం తీసుకోవాలని మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందట. మూడో టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇద్దర్నీ తప్పించాలని ప్లాన్ చేస్తోందట. ఇక ఈ ఇద్దరి స్థానంలో ముకేశ్ కుమార్, దీపక్ చాహర్‌ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఒక మ్యాచ్ గెలిచి ఉత్సాహంతో ఉన్న ఆసిస్ జట్టులోనూ పలు మార్పులు జరిగాయి. భారీ స్కోరునిచ్చి జట్టును విజయ పథంలో నడిపిన మ్యాక్స్‌వెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. చివరి రెండు టీ20లకు మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వడం వల్ల నాలుగో టీ20కి అతడు అందుబాటులో ఉండడు. ఇక స్టాయినిస్ కూడా ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఎక్కువ మంది వరల్డ్ కప్, టీ 20 లు ఆడి అలసి పోవడం వల్ల మిగిలిన వారితోనే నాలుగు, ఐదు టీ20లలో ఆస్ట్రేలియా జట్టు భారత్ తో తలపడనుంది.