ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ పేలవంగా ఉందని టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో ఆసీస్ ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. ఇదే చనువుగా భారత్ ఉత్తమ బ్యాటింగ్ చేసి సిరీస్ నెగ్గాలని ఆశించాడు.
"ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గే అవకాశం భారత్‌కు ఉంది. టాప్-4 బ్యాట్స్‌మన్‌ను పరిగణలోకి తీసుకుంటే ఆసీస్ బ్యాటింగ్ లైనప్ సరిగ్గా లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఆస్ట్రేలియా కన్నా దృఢంగా ఉన్నాయి."
-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్
ఆసీస్ బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉందని గంభీర్ తెలిపాడు. ఇదివరకెప్పుడూ ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ఇంత బలహీనంగా ఉండటం తను చూడలేదని పేర్కొన్నాడు. షమీ, ఇషాంత్, ఉమేశ్ జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు మరింత ఇబ్బంది కలిగేదని వ్యాఖ్యానించాడు. ఆసీస్ గడ్డపై ఆ దేశ జట్టునే ఓడించేందుకు ఇది భారత్‌కు మంచి అవకాశమని వెల్లడించాడు.
ఇదీ చదవండి:చరిత్ర సృష్టించిన ఆసీస్ మహిళా అంపైర్