ఆస్ట్రేలియాతో సిరీస్‌లోని జట్టు కూర్పులను ప్రపంచకప్‌లో వినియోగించకపోవచ్చని భారత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపారు. మెగాటోర్నీని దృష్టిలో ఉంచుకొని జట్టు గెలిచేందుకు అన్ని ప్రయోగాలు చేశామని చెప్పారు.
మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో జట్టు కూర్పుపై ఎలాంటి ఆందోళన లేదని తెలిపారు. ఇంగ్లీష్ గడ్డపై సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు తగట్టుగా అన్ని అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.
టీమిండియా విజయాల రేటు 75శాతం ఉందనే విషయాన్ని మరువకూడదని బదులిచ్చారు అరుణ్. ఏ జట్టుకు ఇన్ని విజయాలు లేవని గుర్తు చేశారు. మెగాటోర్నీ ముందే జట్టులో లోపాలను సరిచేసుకునే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.
ధోనీతో పోల్చొద్దు..
ధోనీతో పంత్‌ను పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు భరత్ అరుణ్. ఇద్దరూ విభిన్నమైన ఆటగాళ్లు. మహీ వికెట్ కీపింగ్‌తో పాటు జట్టు వ్యూహాలను సమర్థంగా అమలుచేయగలడు. కఠినపరిస్థితుల్లో విరాట్‌కు ధోనీ సలహాలు ఉపకరిస్తాయి.
నాలుగో వన్డేలో టర్నర్‌ను స్టంపౌట్ చేయడంలో రిషభ్ పంత్ విఫలమయ్యాడు. దీంతో పంత్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కంగారూలతో రేపు జరగబోయే ఐదో వన్డేలోనూ సత్తా చాటి సిరీస్ కైవసం చేసుకుంటామని భరత్ అన్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమిస్తామని తెలిపారు. నాలుగో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన టర్నర్‌ను ఔట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.