ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడటంపై గాయపడ్డ రోహిత్‌శర్మ జాగ్రత్త వహించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించాడు. అతడికి సుదీర్ఘ కెరీర్ ఉందని పేర్కొన్నాడు. ఒక సీజన్, ఒక సిరీసులో ఆడకుంటే పోయేదేమీ లేదని స్పష్టం చేశాడు.
యూఏఈలో టీ20 లీగ్ ఆడుతున్న పంజాబ్‌తో జరిగిన రెండో పోరులో తొడ కండరాల గాయంతో రోహిత్ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత మ్యాచులేమీ ఆడలేదు. విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవడంతో వివాదం చెలరేగింది. అదే రోజు రోహిత్ నెట్స్‌లో సాధన చేస్తున్న వీడియోను ముంబయి ట్విటర్లో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం.
"టీమ్‌ఇండియాకు ఎంతో విలువైన రోహిత్‌ను తిరిగి మైదానంలోకి తీసుకొచ్చేందుకు బోర్డు ఎంతగానో ప్రయత్నిస్తోంది.రోహిత్ ఇప్పుడు గాయపడ్డాడు. లేదంటే అలాంటి ఆటగాడిని ఎందుకు వదిలేస్తారు? పైగా అతడు పరిమిత ఓవర్ల జట్టుకు వైస్ కెప్టెన్. మేం అతడిని పర్యవేక్షించాల్సి ఉంది. అతడు ఎప్పుడు పునరాగమనం చేస్తాడో నాకు తెలియదు. గాయపడ్డప్పటి నుంచి అతనాడటం లేదు. హిట్‌మ్యాన్ త్వరగా కోలుకోవాలని మేమూ కోరుకుంటున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లను మైదానానికి పంపించడమే బీసీసీఐ కర్తవ్యం."
---బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.
ప్రాక్టీస్ వీడియోలపై..
హిట్‌మ్యాన్ ప్యాడ్లు ధరించి సాధన చేస్తున్న వీడియో పైనా గంగూలీ స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. 'అవును, అతడు మళ్లీ గాయపడొద్దనే మేం కోరుకుంటున్నాం. ఎందుకంటే తొడ కండరాల్లో చీలిక మళ్లీ మళ్లీ వస్తుంది. అదే జరిగితే రోహిత్ మైదానంలో అడుగు పెట్టేందుకు మరింత సమయం పడుతుంది. ముంబయి ఫిజియో, టీమ్‌ఇండియా ఫిజియో అతడిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఐపీఎల్, ఈ సిరీస్ మాత్రమే చివరివి కావని రోహిత్‌కూ తెలుసు. ఏం చేస్తే మంచిదో అతడికి అవగాహన ఉంటుందనే అనుకుంటున్నా' అని దాదా అన్నాడు.
ఇదీ చూడండి:ఐపీఎల్ 13: ఓవర్‌నైట్ స్టార్స్ అయిన ఆటగాళ్లు వీరే!