వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో భారత జట్టు సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత జట్టు సిడ్నీ, కాన్‌బెరా నగరాల్లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడనుంది. సిడ్నీలో క్వారంటైన్ కాలంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు భారత జట్టుకు న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం అనుమతిచ్చింది. న్యూసౌత్ వేల్స్‌కు సిడ్నీ రాజధాని. షెడ్యూలు ప్రకారం కోహ్లీసేన బ్రిస్బేన్‌లో దిగి అక్కడే క్వారంటైన్‌లో ఉండాలి. కానీ క్వారంటైన్ సమయంలో సాధన చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
షెడ్యూల్ ఇదే :
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి రెండు వన్డేలు నవంబరు 27, 29వ తేదీల్లో సిడ్నీలో, చివరి వన్డే కాన్‌బెరాలో జరుగుతాయి. తొలి టీ20 కూడా కాన్‌బెరానే ఆతిథ్యమిస్తుంది. చివరి రెండు టీ20లు తిరిగి సిడ్నీలో జరుగుతాయి. పూర్తి షెడ్యూలును త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.
జెర్సీ భాగస్వామి లేకుండానే ఆస్ట్రేలియాకు!
వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే సుదీర్ఘ పర్యటనకు వెళ్లాల్సిన టీమ్‌ఇండియా జెర్సీ స్పాన్సర్ లేకుండానే పయనమవ్వాల్సిన పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. నైకితో 15 ఏళ్లుగా కొనసాగిన ఒప్పందం గత నెలలో ముగిసిన తర్వాత కొత్తగా దుస్తుల భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏ సంస్థ ముందుకు రాకపోవడమే కారణం. ఆసీస్ పర్యటనకు మరో మూడు వారాలే ఉన్న నేపథ్యంలో కొత్త భాగస్వామిని కోసం బీసీసీఐ మరో ప్రయత్నం చేయనుంది. ఈసారి టెండర్లు ఆహ్వానించకుండా నేరుగా సంస్థలతో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని ఆలోచిస్తోంది.