India to host Afghanistan: అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు 2022-23కు గానూ తన భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ రెండేళ్ల కాలంలో 11 వన్డే, 4 టీ20, రెండు టెస్టు సిరీస్‌ల్లో పాల్గొనబోతుంది అఫ్గాన్ జట్టు. కాగా, వచ్చే ఏడాది మార్చిలో భారత్‌లో కూడా పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.
భారత్‌తో పాటు నెదర్లాండ్స్, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌తో వచ్చే ఏడాది ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతుందీ జట్టు. మొత్తంగా 18 మ్యాచ్‌లు స్వదేశంలో, 34 మ్యాచ్‌లు విదేశాల్లో ఆడేందుకు ప్రణాళికలు రూపొందించింది అఫ్గాన్ బోర్డు.
"ఈ రెండేళ్లలో 52 మ్యాచ్‌లకు గానూ 37 వన్డే, 12 టీ20, 3 టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది అఫ్గాన్ జట్టు. ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా 7 వన్డే సిరీస్‌ల్లో పాల్గొంటుంది. వీటితో పాటు మేజర్ టోర్నీలైన ఆసియా కప్-2022 (టీ20 ఫార్మాట్), టీ20 ప్రపంచకప్-2022, ఆసియా కప్ 2023(వన్డే ఫార్మాట్), వన్డే ప్రపంచకప్‌లు ఆడుతుంది" అని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.