ఆగస్టు 25న లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్టుకు స్టార్ పేసర్ శార్దుల్ ఠాకూర్ అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె వెల్లడించాడు. తొడ కండరాల గాయంతో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టుకు దూరమైన అతడు పూర్తిగా కోలుకున్నట్లు తెలిపాడు.
"మూడో టెస్టు సెలెక్షన్‌కు శార్దుల్ ఠాకూర్ అందుబాటులో ఉంటాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. జట్టు కాంబినేషన్స్ ఆధారంగా అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది" అని రహానె తెలిపాడు.
విమర్శలను పట్టించుకోం..
ఇక తనతో పాటు ఛెతేశ్వర్ పుజారాపై వచ్చిన విమర్శలను పట్టించుకోలేదని చెప్పాడు రహానె. ఒత్తిడిని ఎలా జయించాలో తమకు తెలుసని లార్డ్స్‌లో అదేపని చేసినట్లు వివరించాడు.
బ్యాటింగ్ చేయగలడు..
ఇంగ్లాండ్ వాతావరణం, పిచ్ పరిస్థితుల దృష్ట్యా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతోంది టీమ్ఇండియా. ఈ క్రమంలోనే బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న శార్దుల్ ఠాకూర్ జట్టులోకి వస్తే జట్టు బ్యాటింగ్‌కు బలం చేకూరినట్లు అవుతుంది. తొలి టెస్టులో బ్యాటింగ్‌లో రాణించకపోయినా.. బౌలింగ్‌లో కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు శార్దుల్. లార్డ్స్ టెస్టుకు ముందు అతని తొడ కండరాలు పట్టేయడం వల్ల ఇషాంత్ శర్మకు అవకాశం దక్కింది.
ఇషాంత్ కూడా బౌలింగ్‌లో బాగానే రాణించాడు. కానీ ఎక్కువ ఓవర్లు వేయలేకపోయాడు. ఈ కారణాల వల్ల హెడింగ్లేలో కూడా శార్దుల్ ఆడటం ఖాయంగా కనపడుతోంది. అయితే లీడ్స్ వాతావరణం భిన్నంగా ఉందని, ఎండలు కాచి, వికెట్‌పై టర్న్ లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే టీమ్ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగవచ్చు. అప్పుడు శార్దుల్‌కు తుది జట్టులో చోటు కష్టమవుతుంది.
ఇదీ చూడండి: లార్డ్స్‌లో బుమ్రా, షమీకి ఘనస్వాగతం.. కారణం అతడే!