Venkatesh Iyer : కోల్‌కతా జట్టు స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా గతేడాది టీమ్‌ఇండియాలోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అదే ఏడాది భారత టీ20 లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ఆల్‌రౌండర్‌ను హార్దిక్ పాండ్య స్థానంలో బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. అయితే, ఆసియా కప్‌తో హార్దిక్ తిరిగి ఫామ్ అందుకోవడంతో ఇటీవల జరిగిన ప్రపంచకప్ జట్టులోకి వచ్చేందుకు ఈ ఆటగాడికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన ఈ బ్యాటర్ ఎప్పటికైనా జట్టులో చేరి ఉత్తమ ప్రదర్శన చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"టీమ్‌ఇండియాలో ఎక్కువ కాలం కొనసాగాలని అందరూ కోరుకుంటారు. నేనూ అదే అనుకున్నాను. కానీ, హర్దిక్ భాయ్ తిరిగి జట్టులోకి వచ్చిన పరిస్థితులు నాకు తెలుసు. అతడు చేసింది అద్భుతమనే చెప్పాలి. ప్రపంచకప్ కోసం ఉత్తమ జట్టును ఎంపిక చేసుకోవాలనే అన్ని జట్లు కోరుకుంటాయి. నేను కూడా టీమ్‌ఇండియాలో ఆడాలనుకున్నాను. కానీ అది మన చేతుల్లో లేదు. నేనెప్పుడూ క్రికెట్‌ను ఒక అవకాశంగా చూస్తాను. ప్రధాన జట్టులో చోటుదక్కకపోతే భారత టీ20 లీగ్.. అదీ లేకపోతే దేశీయ క్రికెట్‌లో సొంత రాష్ట్రం తరఫున ఆడతాను. ఆట పరంగా గొప్ప ప్రదర్శన చేయడమే నా పని. సెలక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించను. కివీస్‌తో టీ20 సిరీస్, వన్డేల్లో నేను ఆడాల్సింది. కానీ, గాయం కారణంగా వీటికి దూరమయ్యాను. నాకు ప్రపంచ జట్టులో ఆడే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తాను." అని అన్నాడు.
మొదటినుంచీ కోల్‌కతా తరఫున ఓపెనర్‌గా ఆడిన ఈ ఆల్‌రౌండర్‌కు జట్టులో మాత్రం హార్దిక్ స్థానంలో ఫినిషర్ పాత్ర పోషించాల్సి వచ్చింది. దీనిపై స్పందిస్తూ.. "జట్టులో అప్పటికే కేఎల్ రాహుల్, రోహిత్ భాయ్, ఇషాన్ కిషన్ వంటి ఓపెనర్లు ఉన్నారు. కాబట్టి నేను ఆ స్థానంలో ఆడనని ముందే తెలుసు. రోహిత్ శర్మతో ఇదే విషయంపై చర్చించినప్పుడు నన్ను ఫినిషర్‌గా తీసుకోనున్నారని వివరించాడు. మనకు పూర్తిగా కొత్త పాత్ర ఇచ్చినప్పుడు వారి నుంచి మనకు మద్దతు సైతం లభిస్తుంది. నా విషయంలోనూ అదే జరిగింది. రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నా వెంట నిలిచారు" అంటూ వెంకటేశ్ చెప్పుకొచ్చాడు.