IND VS WI Kohli: టీమ్ఇండియా మాజీ సారథి కోహ్లీ, పంత్‌కు.. వెస్టిండీస్‌తో జరగాల్సిన మూడో టీ20కు దూరంకానున్నారు. వారిద్దరికి బయోబబుల్ నుంచి పది రోజుల పాటు విరామం ఇవ్వనున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు. విరాట్ తన ఇంటికి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో పంత్, కోహ్లీ వచ్చేవారం శ్రీలంకతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు దూరంకానున్నారు. ఇక మార్చి 4 నుంచి మొహాలి వేదికగా జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు తిరిగి జట్టుతో కలవనున్నారు.
"శనివారం ఉదయం కోహ్లీ ఇంటికి వెళ్లాడు. బీసీసీఐ అతడికి విశ్రాంతి కల్పించింది. ఎక్కువ పని భారం ఉండటం, ప్లేయర్ల మానసిక ఆరోగ్యం కోసం అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లకు ఇలాంటి విరామాన్ని బోర్డు ఇస్తూ ఉంటుంది."
-బోర్డు అధికారి.
కోహ్లీ గత డిసెంబర్ నుంచి టీమ్‌ఇండియాతోనే ప్రయాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడగా విరాట్ రెండో టెస్టులో మినహా అన్ని మ్యాచ్‌లూ ఆడాడు. ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటివరకు మూడు వన్డేలు, రెండు టీ20ల్లో ఆడాడు. అయితే, వచ్చేనెల శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోహ్లీకి వందో మ్యాచ్ కావడం వల్ల అందుకు ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ కీలక టెస్టుకు ముందు అతడికి విశ్రాంతి నిచ్చింది బోర్డు.
కాగా, విండీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో గెలుపొందింది. కోహ్లీ(52), పంత్(52) చెరో హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.
ఈనెల 24న భారత్-శ్రీలంక టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు లఖ్‌నవూ ఆతిథ్యమివ్వనుంది. తర్వాత రెండు మ్యాచులు ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8 వరకు మొహలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వరకు బెంగళూరులో రెండో టెస్టును బీసీసీఐ నిర్వహిస్తుంది.
ఇదీ చూడండి: టీమ్ఇండియాదే సిరీస్.. రెండో టీ20లో విండీస్‌పై విజయం