Rohith comments on IND VS SL second T20: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. జడేజా, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.
"మిడిలార్డర్ నిలబడటం చాలా కీలకం. మా మిడిలార్డర్ బ్యాటర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పడం సంతోషంగా ఉంది. గత కొద్ది మ్యాచులుగా అలాంటి ప్రదర్శనే చేస్తున్నారు. మా బ్యాటింగ్ యూనిట్లో అసాధారణమైన ప్రతిభ ఉంది. ప్రతిఒక్కరికీ అవకాశాలు ఇస్తూనే ఉంటాం. దానిని సద్వినియోగం చేసుకోవడం వారిపై ఆధారపడి ఉంటుంది. సంజు అద్భుతంగా ఆడాడు. జట్టులో చాలా మంది ప్రతిభ ఉన్నవారు ఉన్నారు. వారికి ఓ అవకాశం ఇస్తే చాలు తామేంటో నిరూపించుకుంటారు. ఇప్పటివరకు 27మందిని ఆడించాం. మున్ముందు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది(నవ్వుతూ). మేము సిరీస్ గెలిచాం. కానీ కొంతమందికి ఛాన్స్ రాలేదు. మరికొంతమంది టెస్టులు ఆడాల్సి ఉంది. ప్రతిఒక్కరికీ అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. అయితే అంతిమంగా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. అదే సమయంలో ప్లేయర్స్‌లో సానుకూల దృక్పథం నింపడం ముఖ్యం. ఇక డెత్ బౌలింగ్‌లో బౌలర్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కానీ వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. మొదటి కొన్ని ఓవర్లలో(పవర్‌ప్లేలో) బౌలింగ్ బాగా వేశాం. ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాం. చివరి ఐదు ఓవర్లలో వారు 80 పరుగులు చేశారు. ఇలాంటి సమయంలోనే పరిస్థితులను బాగా అర్థం చేసుకోని ఇంకాస్త బాగా ఆడాలి. ఏదేమైనప్పటికీ మేము మొదటి 15 ఓవర్లలో బంతుల్ని బాగా సంధించాం. కాగా, పిచ్ కూడా అద్భుతంగా ఉంది. బాగా సహకరించింది.
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్.
కాగా, రెండో టీ20 టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడో టీ20 నేడు(ఆదివారం) సాయంత్రం ధర్మశాలలో జరగనుంది.
ఇదీ చూడండి: టీమ్ఇండియాదే టీ20 సిరీస్.. శ్రీలంకపై ఘన విజయం