IND VS SA Rohit Sharma : కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది టీమ్ఇండియా. బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే రెండో టెస్ట్‌లో విజయం సాధించామని భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ తెలిపాడు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై భారత బౌలర్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌ల అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించామని తెలిపాడు.
"ఈ విజయం గొప్ప అనుభూతినిచ్చింది. సెంచూరియన్ టెస్ట్ ఓటమి అనంతరం తప్పిదాల నుంచి మేం పాఠాలు నేర్చుకున్నాం. ఈ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చాం. ముఖ్యంగా బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్నా సరైన ప్రదేశంలో బంతులను వేయడం చాలా ముఖ్యం. మా ప్రణాళికలకు తగ్గట్లు మా బౌలర్లు బౌలింగ్ చేసి ఫలితాన్ని అందించారు. బ్యాటింగ్‌లోనూ మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. 100 పరుగుల ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో బ్యాటింగ్ చేశాం"
- రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్
"ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. అయితే ఈ మ్యాచ్ త్వరగా ముగుస్తుందనే విషయం మాకు తెలుసు. ప్రతీ పరుగు కీలకమవుతుందని ముందే గ్రహించాం. దాంతోనే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం చాలా ముఖ్యమని భావించాం. అందుకు తగ్గట్లే బ్యాటింగ్ చేశాం. మహమ్మద్ సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అత్యంత అరుదుగా ఇలాంటి ప్రదర్శనలను చూస్తాం. ఈ గెలుపు క్రెడిట్ మాత్రం బుమ్రా, సిరాజ్, ముకేశ్ కుమార్, ప్రసిధ్ కృష్ణలదే" అని రోహిత్ శర్మ తెలిపాడు.
"పిచ్‌కు తగ్గట్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. గత 4-5 ఏళ్లుగా మేం విదేశాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాం. ఓవర్సీస్లో గుడ్ క్రికెట్ ఆడుతూ తల ఎత్తుకునే ప్రదర్శనలు చేశాం. ఈ సిరీస్ గెలవాలని అనుకున్నాం. కానీ కుదురలేదు. సౌతాఫ్రికా అసాధారణమైన జట్టు. ఎప్పుడూ గట్టి పోటీనిస్తోంది. అందుకే మేం సిరీస్ గెలవలేకపోయాం.సౌతాఫ్రికా మంచి క్రికెట్ జట్టు. అలాంటి జట్టుపై ఇలాంటి విజయాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. డీన్ ఎల్గర్ సౌతాఫ్రికాకు కీలకమైన ఆటగాడు. సౌతాఫ్రికాకు అతను చేసిన సేవ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. కొందరికి మాత్రమే ఇలాంటి ఘనత దక్కుతుంది. అతన్ని త్వరగా ఔట్ చేయడంపైనే ఫోకస్ పెట్టాం. ఇలాంటి కెరీర్ కలిగిన ఆటగాడిని ఎవరైనా అభినందించాల్సిందే. అతని భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. డీన్ ఎల్గర్‌ది అసాధారణమైన కెరీర్" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.