virat kohli SA ODI series: ఈ నెల 16న దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. ఈ టూర్లో మూడు టెస్టులతో పాటు మూడు వన్డేలు ఆడనుంది. ఈ నెల 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకొన్నాడు. ఇతడి స్థానంలో యువ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్‌ను తీసుకుంటున్నట్లు తెలిపింది బీసీసీఐ. తాజాగా వన్డే సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిశాక వన్డే సిరీస్‌లో పాల్గొంటుంది భారత జట్టు. ఈ టీమ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబంతో సమయాన్ని గడపడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని సెలక్షన్ కమిటీకి తెలియజేశాడట విరాట్.
రోహిత్-కోహ్లీకి పడట్లేదా?
గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం కావడం, వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ నుంచి కోహ్లీ వైదొలగాలని చూస్తుండటం.. ఇదంతా అభిమానుల్ని గందరగోళంలో పడేస్తుంది. జనవరి 15న టెస్టు సిరీస్ ముగిశాక 5 రోజుల వ్యవధిలో 19న వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. కేవలం ఐదురోజుల్లోనే అంటే 23న ఈ సిరీస్ ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో సమయం వెచ్చించడం కోసం పర్యటనకు కోహ్లీ దూరమవాలనుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.