IND vs SA ODI: తొలి వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది.
శిఖర్ ధావన్ (79), విరాట్ కోహ్లీ (51), శార్దూల్ (50*) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. ఒకానొక దశలో 181/3 స్కోరుతో ఉన్న టీమ్‌ఇండియాను దక్షిణాఫ్రికా బౌలర్లు బెంబేలెత్తించారు. భారత మిడిలార్డర్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. ఆఖర్లో శార్దూల్ పోరాడినా ఓటమి నుంచి జట్టును తప్పించలేకపోయాడు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 12, రిషభ్ పంత్ 16, శ్రేయస్ అయ్యర్ 17, వెంకటేశ్ అయ్యర్ 2, భువనేశ్వర్ 4, బుమ్రా 14* పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసి 2, ఎంగిడి 2, పెహ్లుక్వాయో 2.. కేశవ్ మహరాజ్, మార్‌క్రమ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇద్దరే ఆడేశారు..
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. 19 పరుగులకే ఓపెనర్ మలన్ (6) ఔటయ్యాడు. అయితే కెప్టెన్ బవుమా (110)తో కలిసి డికాక్ (27) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. డికాక్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మార్‌క్రమ్ (4) వెంటనే పెవిలియన్‌కు చేరాడు. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్నా బవుమా మాత్రం వెనక్కి తగ్గలేదు. తర్వాత వచ్చిన డస్సెన్ (129*)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించి భారత్ ఎదుట భారీ లక్ష్యం ఉంచడంలో కీలక పాత్ర పోషించారు. బవుమా ఔటైనా సరే.. ఆఖర్లో డస్సెన్ వేగంగా ఆడేశాడు. టీమ్‌ఇండియా బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
ఇదీ చూడండి: Maxwell Record: మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. 41 బంతుల్లో సెంచరీ