India vs NZ 2nd Test Toss: వాంఖడే వేదికగా శుక్రవారం భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. రెండు రోజులుగా ముంబయిలో వర్షం కురిసిన కారణంగా ఈ మైదానం ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. దీంతో నేటి ఉదయం 9 గంటలకు వేయాల్సిన టాస్‌ను అంపైర్లు వాయిదా వేశారు.. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి పరిస్థితులు అదుపులోకి రావడం వల్ల టాస్ వేశారు. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌కు కివీస్ సారథి కేన్ విలియమ్సన్ దూరం కావడం వల్ల టామ్ లాథమ్ సారథ్యం చేపట్టాడు.
కీలక ఆటగాళ్లు దూరం
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రహానే, ఇషాంత్, జడేజా ఈ మ్యాచ్‌లో ఆడట్లేదు. గాయాల కారణంగా ఈ టెస్టుకు వీరు ముగ్గురు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ వెల్లడించింది. వీరి స్థానంలో కోహ్లీ, జయంత్ యాదవ్, సిరాజ్ జట్టులోకి వచ్చారు.
నలుగురు కెప్టెన్ల సిరీస్
కివీస్‌తో జరిగిన తొలి టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో తొలి టెస్టులో భారత్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా.. రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చిన కోహ్లీ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. అలాగే కివీస్‌కు తొలి టెస్టులో సారథ్యం వహించిన విలియమ్సన్ గాయంతో రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌కు లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇలా, రెండు టెస్టు మ్యాచ్‌లకు నలుగురు కెప్టెన్లుగా వ్యవహరించడం విశేషం.
India vs NZ 2nd Test Squads
భారత్
మయాంక్ అగర్వాల్, గిల్, పుజారా, కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, సాహా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, సిరాజ్
న్యూజిలాండ్
లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారెన్ మిచెల్, టేలర్, నికోలస్, బ్లండెల్, రచిన్ రవీంద్ర, జేమీసన్, సౌథీ, సోమర్విల్లే, అజాజ్ పటేల్