న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచుల్లో తుది జట్టులోకి ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను తీసుకోకపోవడంపై పలువురు టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. పొట్టి సిరీస్‌లో ఆటగాళ్లను మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుందని తాను అనుకోవడం లేదని తెలిపాడు. ఇలాంటి విమర్శలు తనను బాధించవన్నాడు.
"ఇది నా జట్టు. జట్టుకు సరిపోయే ఆటగాళ్లను కోచ్‌తో కలిసి నేను ఎంపికచేసుకుంటాను. ఇంకా చాలా సమయం ఉంది. ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుంది. ఒకసారి జట్టులోకి వస్తే వారు ఎక్కువ కాలం పాటు కొనసాగుతారు. ఇక దీని గురించి బయట నుంచి వచ్చే విమర్శలను నేను పట్టించుకోను. ఒకవేళ ఇది ఎక్కు వ మ్యాచ్‌లు ఆడే సుదీర్ఘ సిరీస్ అయితే.. కచ్చితంగా అందరినీ ఆడిస్తాం. అంతేకానీ జట్టును మధ్యలో విభజించి మార్పులు చేయడం సరైందని నేను నమ్మను. భవిష్యత్తులో కూడా నా పద్ధతి ఇలాగే ఉంటుంది" అంటూ హార్దిక్ వివరించాడు. అదే సమయంలో సంజూ శాంసన్ అంశంపైకూడా స్పందించాడు.
"ఉదాహరణకు సంజూనే తీసుకోండి.. మేం అతడిని జట్టులోకి తీసుకోవాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. నేను వారి స్థానంలో ఉండి ఆలోచించగలను. టీమ్‌ఇండియాలో కొనసాగుతూ 11 మంది ఆటగాళ్లలో ఒకరిగా లేకపోవడం ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు. కానీ నేను కెప్టెన్‌గా ఉంటే మాత్రం ఆ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాను. వారు నాతో, కోచ్‌తో మాట్లాడితే నేను వారికి సర్దిచెప్పగలను. ఎందుకంటే నాది జట్టును కలిసికట్టుగా ఉంచగలిగే స్వభావం" అంటూ పాండ్యా వివరించాడు.
ఇదీ చూడండి: స్టార్ ఫుట్‌బాలర్ రొనాల్డోకు షాక్.. జట్టు నుంచి తప్పించిన యాజమాన్యం