వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. కంగారూల బౌలింగ్ ధాటికి కుప్పకూలింది. 10 ఓవర్లలోపే సగం వికెట్లు చేజార్చుకున్న టీమ్ఇండియా.. చివరకు 26 ఓవర్లలో 117 పరుగులకే చాపచుట్టేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. స్టార్క్ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. సీన్ అబాట్ 3, నేథన్ ఇలిస్ రెండు వికెట్లు పడగొట్టారు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. ఆరంభంలోనే తడబడింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్, కోహ్లీ కాసేపు బౌండరీలతో అలరించారు. ఆ కొద్ది క్షణాలే టీమ్ఇండియా అభిమానులను అలరించాయి. ఐదో ఓవర్లో రోహిత్ అవుట్ కాగా.. ఇక భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపించింది. రోహిత్ ఔట్ అయిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. మళ్లీ మొదటి బంతికే పెవీలియన్ చేరాడు. అచ్చం ముంబయి వన్డే మాదిరిగానే అతడు ఔట్ అయ్యాడు. రాహుల్, హార్దిక్ పాండ్య వచ్చినట్లే వచ్చి.. వెళ్లిపోయారు. కోహ్లీ 31 పరుగులు చేయగా.. జడేజా 16 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ (29) కాస్త మెరుపులు మెరిపించాడు.
ఇక మ్యాచ్‌కు కాసేపు ఊరట కలిగించిన విరాట్ కోహ్లీ 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు కొట్టి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే రోహిత్, విరాట్లు మ్యాచ్‌ను ఎలాగైన గట్టెక్కిస్తారనుకుంటే ఆఖరికి వాళ్లు కూడా పెవిలియన్ బాట పట్టారు. ఇక ఆసిస్ బౌలర్ మిషెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. సీన్ అబాట్ మూడు వికెట్లు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు పడగొట్టారు.
గత కొంత కాలంగా బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన చూపించిన ఆసిస్ ఆటగాడు స్టార్క్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఫైఫర్ సాధించి ఓ అరుదైన రికార్డును సాధించాడు. వన్డేల్లో అత్యధిక ఫైఫర్‌లు తీసిన ఆటగాళ్ల జాబితాలోకి చేరిపోయాడు. ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న లసిత్ మలింగ (8)ను వెనక్కినెట్టి, బ్రెట్ లీ (9), షాహిద్ అఫ్రిదిల (9) సరసన స్థానాన్ని సాంపాదించుకున్నాడు. తన కెరీర్‌లో దాదాపు 109 వన్డేలు ఆడిన స్టార్క్ 9 ఫైఫర్‌ల సాయంతో 219 వికెట్లు పడగొట్టాడు.
టీమ్ ఇండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా
టీమ్ ఆస్ట్రేలియా
ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), అలెక్స్ కారీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, మార్నస్ లాబుస్చాగ్నే