Kapil dev on Kohli Form: పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్. టీ20ల్లో నుంచి విరాట్‌ను పక్కనపెట్టాలని సూచించాడు.
"టెస్టుల్లో ప్రపంచ నెంబర్ 2 బౌలర్ అశ్విన్‌ను టెస్టు జట్టు నుంచి తప్పించినప్పుడు.. టీ20ల్లో ఆడే 11 మంది నుంచి కోహ్లీని బెంచ్‌కే ఎందుకు పరిమితం చేయకూడదు. ప్రపంచ నెంబర్ 2 బౌలర్‌ను పక్కనపెట్టినప్పుడు.. నెంబర్ 1 బ్యాటర్‌ను కూడా వదులుకోవచ్చు. ప్రస్తుతం విరాట్ బ్యాటింగ్ స్థాయి మునపటిలా లేదు. అతను తన ప్రదర్శనల కారణంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. జట్టులో స్థానం కోసం పోటీ పడాలి. విరాట్‌ను అధిగమించేందుకు యువకులు ప్రయత్నించాలి"అని కపిల్ పేర్కొన్నాడు.
ఒకవేళ వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతినిస్తే.. అతడిని దూరం పెట్టినట్లే పరిగణించాలని కపిల్ అభిప్రాయపడ్డాడు. "అనేక ఆప్షన్‌లు ఉన్నప్పుడు మీరు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశమివ్వాలి. కేవలం పేరు, ప్రఖ్యాతులను పట్టించుకోకుండా ప్రస్తుతం ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. మీరు స్థిరపడిన ఆటగాడే కావచ్చు. కానీ మీరు వరుసగా ఐదు గేమ్స్‌లో విఫలమైనప్పిటీకీ అప్పుడు కూడా ఆడే అవకాశాలుంటాయనేది దీని అర్థం కాదు" అని కపిల్ దేవ్ స్పష్టం చేశారు.
కాగా, పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కోహ్లీని పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మూడేళ్ల నుంచి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ ఏడాది అతడి ఫామ్ మరింత పడిపోయింది. ఈ ఐపీఎల్లో అతడు 16 ఇన్నింగ్స్‌లో 115.98 సగటుతో కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 11,20 పరుగులతో విఫలమయ్యాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. దీంతో విరాట్ స్థానంపై సందిగ్ధత నెలకొంది.
ఇదీ చూడండి: లండన్ వీధుల్లో 'దాదా' చిందులు.. నైట్‌పార్టీలో హంగామా