ICC Womens Rankings: మహిళల ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఇంటిముఖం పట్టినా.. మన క్రికెటర్ల ర్యాంకులు మాత్రం పైకి ఎగబాకాయి. బ్యాటర్ల జాబితాలో భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (686) ఆరో స్థానానికి, బౌలర్ల విభాగంలో ఝులన్ గోస్వామి టాప్-10లోకి దూసుకొచ్చింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ మ్యాచుల్లో మిథాలీ వరుసగా రెండు మ్యాచుల్లో అర్ధశతకాలను నమోదు చేసింది. ఓపెనర్ స్మృతీ మంధాన (669) తన పదో ర్యాంకును పదిలం చేసుకుంది.
ఇక దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వాల్వార్డెట్ ర్యాంకింగ్‌లో తొలిస్థానంలో ఉంది. ఆసీస్ ప్లేయర్ బేత్ మూనీ రెండు, అదే దేశానికి చెందిన మెగ్ లానింగ్ మూడో స్థానంలో నిలిచంది. నటాలీ స్కివెర్(ఇంగ్లాండ్), ఆలీసా హీలే(ఆసీస్) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
బౌలర్ల విభాగంలో టీమ్‌ఇండియా నుంచి ఝులన్ గోస్వామి (663) మాత్రమే టాప్-10 ఉండటం గమనార్హం. ప్రపంచకప్‌లో ప్రదర్శనతో రెండు స్థానాలను మెరుగుపరుచుకుని ప్రస్తుతం ఐదో ర్యాంకుకు ఎగబాకింది. ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎక్లేస్టోన్ అగ్రస్థానంలో ఉంది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలోనూ ఝలన్ గోస్వామి పదో స్థానంలోకి దూసుకొచ్చింది. దీప్తి శర్మ ఏడో ర్యాంకులో కొనసాగుతోంది. ఆసీస్‌కు చెందిన ఎలీసే పెర్రీ, నటాలీ స్కివెర్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చదవండి: Mithali Raj: దశాబ్దాల కల నెరవేరలేదు.. మిథాలీ కథ ముగిసిందా?