ICC BOARD MEET PCB BCCI: టీమ్‌ఇండియాతో మ్యాచ్‌లను ఆడేందుకు పాకిస్థాన్ తహతహలాడుతోంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు లేకుండా పోయాయి. దీంతో ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, నాలుగేళ్లకు వచ్చే వన్డే ప్రపంచకప్‌లో మాత్రమే సాధ్యమవుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ బోర్డు సమావేశంలో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా సరికొత్త ప్రతిపాదన పెట్టాడు. దీని వల్ల ఆదాయమూ భారీగానే వస్తుందని అంచనా వేశాడు. భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో ప్రత్యేక టోర్నమెంట్‌ను నిర్వహించాలని పేర్కొన్నాడు.
తన ప్రతిపాదన ప్రకారం నాలుగు జట్లతో టోర్నీ నిర్వహిస్తే దాదాపు 750 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని రమీజ్ రజా అంచనా వేస్తున్నాడు. అయితే ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్లలో తప్పనిసరిగానే పాక్‌తో ఆడాల్సి వస్తున్న నేపథ్యంలో రమీజ్ రజా ప్రతిపాదనకు బీసీసీఐ పెద్దగా ఆసక్తి చూపించలేదని సమాచారం. ఐసీసీ కూడా ఇప్పటివరకు త్రైపాక్షిక సిరీస్‌లను మాత్రమే నిర్వహించింది. నాలుగు జట్లతో టోర్నీలకు అనుమతి ఇస్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి.
మరోవైపు ఐసీసీ ఛైర్మన్ పదవికి మరోసారి గ్రెగ్ బార్‌క్లే నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ(ఆదివారం) ఐసీసీ బోర్డు సమావేశంలో చర్చ జరగనుంది. బార్‌క్లే మరోసారి పదవి చేపట్టేందుకు ఆసక్తిగా లేకపోతే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, బీసీసీఐ కార్యదర్శి జైషా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఆ కీలక పదవి కోసం గంగూలీ వర్సెస్ జై షా?