పురుషులు, మహిళల 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డులను ఐసీసీ ప్రకటించింది. పురుషుల్లో సెప్టెంబర్ నెలకు గాను పాకిస్థాన్‌కు చెందిన ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. మహిళలల్లో టీమ్ ఇండియా ప్లేయర్ హర్మన్‌ప్రీత్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డులు గెలిచిన ఇద్దరు ప్లేయర్లు.. ఐసీసీ నుంచి గోల్డ్ మెడళ్లు అందుకోనున్నారు.
ఇటీవల.. టీమ్ ఇండియా కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్భుతంగా రాణించింది హర్మన్. ఇంగ్లాండ్‌తో ఆడిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది టీమ్ ఇండియా. 1999 తర్వాత ఇంగ్లాండ్‌పై భారత్ సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్‌లో 103.27 స్ట్రైక్ రేట్‌తో 221 పరుగులు చేసింది హర్మన్.
'ఈ అవార్డుకు నామినేట్ అవ్వడం, ఆ అవార్డు నాకు దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గర్వకారణం. అలాగే ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గెలవడం నాకు మరచిపోలేని అనుభూతి' అని అవార్డు వచ్చిన సందర్భంగా హర్మన్ ప్రీత్ చెప్పింది.
పురుషుల్లో రిజ్వాన్..
టీ20ల్లో పరుగులు వేట కొనసాగిస్తున్న పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. సెప్టెంబర్ నెలకు ప్లేయర్ అఫ్ ది మంత్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్బంగా రిజ్వాన్ మాట్లాడాడు. 'ఈ విజయానికి కారణం మా టీమ్ ప్లేయర్లు. ఇలాంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. నేను నా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నాను. ఆస్ట్రేలియాలో జరగబోయే వరల్డ్‌కప్‌లో ఇంకా మంచి ప్రదర్శన చేస్తానని ఆశిస్తున్నాను. ఈ అవార్డును వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పాకిస్థాన్ ప్రజలకు అంకితమిస్తున్నాను. ఈ అవార్డు వారి ముఖలపై చిరునవ్వులు పూయిస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నాడు.
సెప్టెంబర్‌లో రిజ్వాన్ 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 7 అర్ధ సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్‌తో ఆడిన 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. మొదటి ఐదు మ్యాచ్‌ల్లో 60 పైగా స్కోర్ చేశాడు రిజ్వాన్.