రసవత్తరంగా సాగిన టీ20 ప్రపంచకప్ చివరికి సరైన జట్టునే వరించింది. అన్ని అర్హతలున్న ఇంగ్లాండ్ సగర్వంగా రెండో సారి పొట్టి కప్పును ముద్దాడింది. ఈ విజయాలను అందుకునే దిశగా జట్టు బలంగా మారడం వెనక ఓ పరాభవం ఉంది. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలే సాధించింది. చివరకు బంగ్లాదేశ్‌తోనూ ఓడింది. దీంతో ఇంటా, బయట తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పుడే జట్టులో ప్రక్షాళన మొదలైంది. రక్షణాత్మక ఆటకు స్వస్తి పలికిన ఆ జట్టు దూకుడును అలవరుచుకుంది. నైపుణ్యాలున్న ఆటగాళ్లను సానబెట్టింది. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పరిమిత ఓవర్ల జట్టుగా అవతరించింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆ ఫలితం కనిపించింది. ఫైనల్లో కొద్దిలో ఓడింది. అప్పటి నుంచి జట్టులో ఆటగాళ్లు మారినా, కోచ్‌లు మారినా, కెప్టెన్‌లు మారినా.. బెదురులేని జట్టు ఆటతీరు మాత్రం కొనసాగుతోంది. 2019 వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆ జట్టునే టైటిల్ ఫేవరెట్‌గా పరిగణించారు. అంచనాలను నిలబెట్టుకుంటూ కప్పు కొట్టేసింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ ఆ జట్టే విజేతగా నిలుస్తుందనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. కానీ సెమీస్‌లో వెనుదిరిగింది. ఈ సారి కూడా అంచనాలను నిజం చేస్తూ విజేతగా నిలిచింది.
అదే ప్రత్యేకత: ఏ జట్టులోనైనా ఒకరో లేదా ఇద్దరో ఆల్‌రౌండర్లు ఉంటారు. కానీ ఇంగ్లాండ్ జట్టులోని ఆటగాళ్లలో సింహ భాగం వీళ్లదే. ఫైనల్ ఆడిన జట్టును చూసుకుంటే స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కరన్, క్రిస్ వోక్స్.. ఇలా అయిదుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. 8, 9 స్థానాల వరకూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యమున్న బ్యాటర్లున్నారు. అలాగే ఏడు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కొన్ని జట్లలో ఓ స్టార్ ఆటగాడు విఫలమైతే ఆ ప్రభావం జట్టు మొత్తం మీద పడుతుంది.
కానీ ఇంగ్లాండ్‌కు ఆ భయమే లేదు. ఒకరు కాకపోతే మరొకరు జట్టును గెలిపిస్తారు. ఓ బౌలర్ పరుగులు సమర్పించుకుంటే ప్రత్యామ్నాయంగా మరో బౌలర్ సిద్ధంగా ఉంటాడు. ఓ బ్యాటర్ విఫలమైతే ఆ లోటు పూడ్చేందుకు మరో బ్యాటర్ బాధ్యతలు తీసుకుంటాడు. వికెట్లు పడ్డా వీళ్లు నెమ్మదించరు. సూపర్-12లో ఇంగ్లాండ్ తడబడి ఉండొచ్చు. వర్షం కారణంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయి ఉండొచ్చు. కానీ కీలకమైన సెమీస్, ఫైనల్లో జూలు విదిల్చింది. నాణ్యమైన జట్టు ఉంటే అత్యుత్తమ ఫలితాలు వస్తాయనేందుకు ఇదే నిదర్శనం. మిగతా జట్లు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని బలోపేతమయ్యే దిశగా సాగాలనడంలో అతిశయోక్తి లేదు.
1992 కథ మారింది
గతం పునరావృతం కాలేదు. ఈ సారి కథ మారింది. 1992 వన్డే ప్రపంచకప్‌లో ఇప్పట్లాగే సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన పాక్ తుది పోరు చేరింది. ఇంగ్లాండ్‌ను ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. మళ్లీ అదే తరహాలో, అప్పటి ఫైనల్ వేదిక మెల్‌బోర్న్‌లోనే ఇరు జట్లూ తలపడడంతో చరిత్ర పునరావృతం అవుతుందని పాక్ అభిమానులు ఆశించారు. కానీ ఈసారి ఇంగ్లాండ్ వదల్లేదు. గెలుపు కోసం పాక్ గట్టిగానే పోరాడినా ఓటమి తప్పలేదు.
ఇదీ చదవండి: T20 World Cup: పాకిస్థాన్‌కు గట్టి షాక్.. రెండోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడిన ఇంగ్లాండ్
సానియా-షోయబ్ విడాకులు నిజమేనా? లేక రియాలిటీ షో కోసం జిమ్మిక్కులా?