IPL 2022 Highest Chased Targets: ఐపీఎల్ 2022 ప్రారంభమై వారం రోజులు పూర్తికానుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో కొంతమంది కుర్లోళ్లు అదరగొట్టగా.. మరికొంతమంది సీనియర్లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. కాగా, టీ20 క్రికెట్ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బ్యాటర్లు పరుగుల వరద పారించాలి. ఐపీఎల్ మ్యాచుల్లో జట్లు 200+ స్కోర్లు ప్రత్యర్థి టీమ్‌లకు నిర్దేశించినా అలవోకగా ఛేదించేస్తున్నారు. బ్యాటర్లు చెలరేగి స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో రెండు మ్యాచుల్లో.. 200+ భారీ లక్ష్యాలను జట్లు ఛేదించాయి. ఈ నేపథ్యంలో లీగ్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక నాలుగు ఛేదనలను ఓ సారి పరిశీలిద్దాం.
తెవాతియా ఊపిరిపోశాడు.. ఈ టీ20లీగ్ మొత్తంలో భారీ ఛేదన అంటే రాజస్థాన్‌దే. 2020 సీజన్‌లో ఓ మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో సంజూ శాంసన్ (85; 42 బంతుల్లో 4x4, 7x6) విధ్వంసానికి తోడు రాహుల్ తెవాతియా (53; 31 బంతుల్లో 7x6) విరోచిత బ్యాటింగ్ జత కలిసిన వేళ రాజస్థాన్ మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో ఈ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదనను పూర్తి చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడానికి ప్రధాన కారణం తెవాతియా. ఆ జట్టు ఓటమి ఖాయమనుకున్న దశలో అతడు 18వ ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసి పంజాబ్‌కు షాకిచ్చాడు. అంతకుముందు పంజాబ్ బ్యాటింగ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (69; 54 బంతుల్లో 7x4, 1x6), మయాంక్ అగర్వాల్ (106; 50 బంతుల్లో 10x4, 7x6) రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్నారు. దీంతో ఆ జట్టు 223/2 పరుగుల భారీ స్కోర్ చేసింది.
పొలార్డ్ నిలబడి కొట్టాడు..ఈ లీగ్‌లో రెండో అత్యుత్తమ ఛేదన అంటే చెన్నైపై ముంబయి సాధించింది. గతేడాది జరిగిన ఓ లీగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. డుప్లెసిస్ (50), మొయిన్ అలీ (58) అర్ధ శతకాలకు తోడు అంబటి రాయుడు (72 నాటౌట్; 27 బంతుల్లో 4x4, 7x6) చివర్లో దంచికొట్టడంతో చెన్నై ఊహించని స్కోర్ సాధించింది. ఇక చెన్నై విజయం లాంఛనమే అనుకున్న స్థితిలో ముంబయి ఆల్‌రౌండర్ పొలార్డ్ షాకిచ్చాడు. టాప్ ఆర్డర్‌లో డికాక్ (38), రోహిత్ శర్మ (35), కృనాల్ పాండ్య (32) పెద్దగా రాణించకపోయినా పొలార్డ్ (87 నాటౌట్; 34 బంతుల్లో 6x4, 8x6) ఆఖరి వరకు నిలబడి దంచి కొట్టాడు. చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమైన వేళ రెండు ఫోర్లు, ఒక సిక్సర్, ఒక డబుల్ తీసి ముంబయికి మర్చిపోలేని విజయాన్ని అందించాడు.
గ్రేమ్‌స్మిత్, యూసుఫ్ పఠాన్ మెరుపులు.. ఇక మూడో అత్యుత్తమ ఛేదన అంటే టోర్నీ ఆరంభ సీజన్ 2008లో హైదరాబాద్‌పై రాజస్థాన్ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనా.. రోహిత్ శర్మ (36)తో కలిసి ఆండ్రూ సైమండ్స్ (117 నాటౌట్; 53 బంతుల్లో 11x4, 7x6) రెచ్చిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీలకు తరలించాడు. దీంతో అద్వితీయమైన శతకం సాధించడమే కాకుండా రాజస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. యూసుఫ్ పఠాన్ (61; 28 బంతుల్లో 4x4, 6x6), గ్రేమ్ స్మిత్ (71; 45 బంతుల్లో 9x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు చివర్లో షేన్‌వార్న్ (22; 9 బంతుల్లో 2x4, 2x6) ధాటిగా ఆడి రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆ జట్టు తొలి సీజన్‌లోనే రికార్డు ఛేదన పూర్తి చేసింది.
లూయిస్ దెబ్బకొట్టాడు.. ఈ లీగ్‌లో మరో అతిగొప్ప ఛేదన అంటే గతరాత్రి చెన్నైపై కొత్త జట్టు లఖ్‌నవూ సాధించింది. సాధారణంగా చెన్నై 180 పరుగుల స్కోర్ చేసిందంటే ప్రత్యర్థిని అంతకన్నా తక్కువ పరుగులకే కట్టడి చేస్తుంది. కానీ, గతేడాది ముంబయిలాగే ఈసారి లఖ్‌నవూ చెన్నైపై విజయం సాధించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయిస్ (55 నాటౌట్; 23 బంతుల్లో 6x4, 3x6), ఆయుష్ బదోని (19; 9 బంతుల్లో 2x6) ఆఖరి నిమిషాల్లో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు. తొలుత చెన్నై జట్టులో రాబిన్ ఉతప్ప (50; 27 బంతుల్లో 8x4, 1x6), శివమ్ మావి (49; 30 బంతుల్లో 5x4, 2x6) దంచికొట్టడంతో పాటు మొయిన్ అలీ (35; 22 బంతుల్లో 4x4, 2x6) మెరవడంతో 210/7 భారీ స్కోర్ చేసింది. అయితే, ఛేదనలో లఖ్‌నవూకు శుభారంభం దక్కినా మధ్యలో తడబడింది. ఓపెనర్లు రాహుల్ (40; 26 బంతుల్లో 2x4, 3x6), క్వింటన్ డికాక్ (61; 45 బంతుల్లో 9x4) తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. కానీ, స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడిపోవడంతో ఆ జట్టు తడబాటుకు గురై రన్‌రేట్ పెరిగింది. దీంతో లఖ్‌నవూ ఓటమిపాలయ్యేలా కనిపించింది. చివరికి లూయిస్, బదోని ధాటిగా ఆడి రికార్డు ఛేదనలో గెలిపించారు. ఇదే సీజన్‌లో ఆర్‌సీబీ మీద పంజాబ్ కూడా 200పై చిలుకు లక్ష్యాన్ని ఛేదించింది.
ఇదీ చదవండి: చెన్నై చరిత్రలో తొలిసారి అలా!.. 'టీ20ల్లో ధోనీ రికార్డు'