ఆటకు వీడ్కోలు
Harbhajan Retirement: టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చాలాకాలంగా జట్టులో చోటు కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడం వల్ల ఆటకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎల్లవేళలా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు కృతజ్ఞతలు తెలిపాడు.
"ప్రతి మంచి పనికి ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది. నా జీవితానికి ఓ అర్థాన్నిచ్చిన ఆటకు ఈరోజు వీడ్కోలు పలుకుతున్నా. ఈ 23 ఏళ్ల ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించాడు భజ్జీ.
టీమ్ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన దిగ్గజ స్పిన్నర్లలో హర్భజన్ సింగ్ ఒకరు. కుంబ్లే తర్వాత జట్టుకు గొప్ప వరంగా మారాడు భజ్జీ. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ జట్టును విజయంవైపు నడిపించాడు.
కెరీర్లో తొలి టెస్టును అజారుద్దీన్ కెప్టెన్సీలో ఆడిన భజ్జీ.. చివరి టెస్టు మ్యాచ్ విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడాడు. అలాగే టీ20 ప్రపంచకప్-2016 తర్వాత మరో మ్యాచ్ ఆడలేదీ స్పిన్నర్. అనంతరం ఐపీఎల్లో ధోనీ, రోహిత్ సారథ్యంలో చెన్నై, ముంబయి జట్లు విజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు.
రెండో అత్యుత్తమ బౌలర్
అంతర్జాతీయ కెరీర్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు హర్భజన్. ఇతడు మొత్తంగా 711 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 953 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ (687), రవి అశ్విన్ (638), జహీర్ ఖాన్ (597) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
టెస్టు కెరీర్ (1995-2015)
భజ్జీ తన టెస్టు కెరీర్లో మొత్తం 103 మ్యాచ్‌లు ఆడి 417 వికెట్లు సాధించాడు.
వన్డే కెరీర్ (1998-2015)
236 వన్డే మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 269 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
టీ20 కెరీర్ (2006-2016)
పదేళ్ల పాటు పొట్టి ఫార్మాట్‌కు సేవలందించిన హర్భజన్.. తన కెరీర్లో 28 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు దక్కించుకున్నాడు.
ఐపీఎల్ కెరీర్ (2008-2021)
జాతీయ జట్టులో చోటు లభించకపోయినా ఐపీఎల్లో మాత్రం స్థిరమైన ప్రదర్శన చేస్తూ అభిమానుల్ని అలరించాడు హర్భజన్. ఈ లీగ్‌లో మొత్తం 163 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడాడు భజ్జీ.