Harbhajan praises Ganguly: తాను ఇంత గొప్ప ఆటగాడిగా ఎదగడానికి టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనే కారణమని ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అన్నాడు. శుక్రవారం అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం తనని వెన్నుతట్టి ప్రోత్సహించిన నాయకుడి గురించి మాట్లాడాడు.
"కెరీర్ ఆరంభంలో అనామకుడిగా ఉన్న నాకు గంగూలీనే అండగా నిలిచాడు. నాకెంతో నైపుణ్యం ఉందని దాదాకు తెలుసు. అయితే, నేను అంతలా రాణిస్తానా? లేదా? అనేది తెలియదు. ఇక ధోనీ విషయానికొస్తే.. నేను బరిలోకి దిగితే పని పూర్తి చేస్తానని తెలుసు. అతడు జట్టులోకి రాకముందే పలు మ్యాచ్‌లు గెలిపించాను. అలాగే తన సారథ్యంలోనూ మరిన్ని మ్యాచ్‌లు గెలిపిస్తానని ధోనీకి తెలుసు. ఎవరికైనా జీవితంలో లేదా ప్రొఫెషనల్‌గా మనల్ని సరైన దిశలో నడింపించే వ్యక్తి ఒకరు ఉండాలి. నా విషయంలో అది గంగూలీనే. నేను జట్టులో ఉండేందుకు దాదా ఆరోజు నాకోసం పట్టుపట్టకపోతే (సెలెక్టర్లతో) ఈరోజు నేను ఎవరికి తెలిసేవాడిని కాదు. కనీసం మీరు ఈరోజు నా ఇంటర్వ్యూ కూడా తీసుకునేవాళ్లు కాదు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు అతడే కారణం."
-హర్భజన్, టీమ్ఇండియా మాజీ స్పిన్నర్
"ధోనీ కూడా చాలా మంచి నాయకుడే. దాదా వారసుడిగా జట్టును నడిపించాడు. అతడి సారథ్యంలో కొన్ని అద్భుతమైన విజయాలు సాధించాను. అవి నా జీవితంలో ప్రత్యేకంగా నిలుస్తాయి. చివరగా ఈ రిటైర్మెంట్ ప్రకటనకు సంబంధించి గంగూలీ, కార్యదర్శి జైషాతో మాట్లాడాను. వారికి నా నిర్ణయం చెప్పాను. వాళ్లు సానుకూలంగా స్పందించి భవిష్యత్ గురించి శుభాకాంక్షలు చెప్పారు. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటా" అని స్పిన్ దిగ్గజం వివరించాడు.
హర్భజన్ 1998లో తొలిసారి మహ్మద్ అజాహరుద్దీన్ సారథ్యంలో టీమ్‌ఇండియాలో అడుగుపెట్టాడు. ఆపై 2001లో గంగూలీ సారథ్యంలో స్వదేశంలో జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్‌తో తనదైన ముద్ర వేశాడు. ఆపై మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో రెండు ప్రపంచకప్‌లు సాధించాడు. ఈ క్రమంలోనే హర్భజన్ టీమ్‌ఇండియాలో అతిగొప్ప ఆఫ్ స్పిన్నర్‌గా నిలిచాడు.